
ప్రస్తుతం బెంగళూరుకు చెందిన జెనో అనే ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ.. ఎమారా పేరుతో మోటారు సైకిల్ ను విడుదల చేసింది. ఇది దేశంలోనే మొదటి స్పోర్ట్ యుటిలిటీ ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ (ఎస్ యూఈఎమ్) అని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ బైక్ ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం. జెనో ఎమారా ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకతల్లోకి వెళితే.. ఈ బండి సుమారు 250 కిలోల బరువు మోస్తుంది. మిగిలిన ఈవీలతో పోల్చితే రెట్టింపు సామర్థ్యం కలిగి ఉంది. దీనిలోని 4 కేడబ్ల్యూహెచ్ అన్ బోర్డ్ బ్యాటరీని 8 కేడబ్ల్యూహెచ్ వరకూ విస్తరించుకోవచ్చు. సింగిల్ చార్జింగ్ పై సుమారు వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. మాస్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని ఈ బండిని తయారు చేశారు.
మల్టీ మోడల్ చార్జింగ్ ఎకో సిస్టమ్ తో జెనో బైక్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. బ్యాటరీ స్వాపింగ్, ఫాస్ట్ చార్జింగ్, హోమ్ చార్జింగ్ లను వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా చార్జింగ్ విషయంలో వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని కీలక ప్రాంతాల్లో చార్జింగ్ సదుపాయాలను కల్పించాలని జెనో లక్ష్యంగా పెట్టుకుంది. 2029 నాటికి దేశమంతటా 20 వేలకు వాటిని విస్తరించనుంది. జెనో ఎమారా బైక్ ను ప్రజలందరికీ అందుబాటులో ధరలో తీసుకురానున్నారు. వినియోగదారులు ఆ బైక్ ను బ్యాటరీతో కొనుగోలు చేయవచ్చు. లేదా బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ (బాస్) విధానాన్ని ఎంచుకోవచ్చు. బ్యాటరీతో పాటు బైక్ ను రూ.1,19,000కు కొనుగోలు చేసుకోవచ్చు. ముందుగా ఆర్డర్ చేసుకున్న 5 వేల మందికి రూ.లక్షకే అందజేస్తారు. ఆ తర్వాత ఐదువేల ఆర్డర్లకు రూ.1,04,000కు అందిస్తారు. పదివేల నుంచి 20 వేల వరకూ వచ్చిన ఆర్డర్లకు రూ.1,09,000 చొప్పున తీసుకుంటారు.
బాస్ విధానంలో బైక్ ప్రారంభ ధర రూ.64 వేల నుంచి మొదలవుతుంది. సబ్ స్క్రైబర్లు ప్రీ పెయిడ్ ఎనర్జీ ప్లాన్లను తీసుకోవచ్చు. 48 కేడబ్యూహెచ్ కి నెలకు రూ.1500, అలాగే 120 కేడబ్ల్యూహెచ్ కు నెలకు రూ.2500, లేదా కేడబ్ల్యూహెచ్ కి రూ.52 చొప్పున పోస్టు పెయిడ్ ఆప్షన్ తో వెళ్లవచ్చు. బాస్ విధానంలో మొదటి 5 వేల మందికి రూ.64 వేలు, ఆ తర్వాత ఐదువేల మందికి రూ.69 వేలు, అనంతరం మరో పది మందికి రూ.74 వేలకు బండిని అందజేస్తారు. ఎమారా బైక్ కోసం ముందుగా ఆర్డర్ చేసుకోవచ్చు. జెనో వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా రూ.935 చెల్లించి బుక్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. వీరికి ప్రత్యేక తగ్గింపు ధర, డెలివరీ స్లాట్లు లభిస్తాయి. 2026లో ఈ బైక్ డెలివరీలు జరుగుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి