Yusuf Pathan : ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లోని గ్రేస్ రోడ్ క్రికెట్ గ్రౌండ్లో భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో ఇండియా ఛాంపియన్స్ జట్టు వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బిన్నీ అజేయంగా 50 పరుగులు సాధించగా, యూసుఫ్ పఠాన్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అయితే, విజయం సాధించిన వెంటనే జరిగిన సంఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. యూసుఫ్ పఠాన్ బౌండరీ రోప్స్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, ఇండియా విజయాన్ని తన పిల్లలను హత్తుకుని, ముద్దుపెట్టుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ దృశ్యం చాలా మందిని కదిలించింది.
డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా, వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ ఇండియా ఛాంపియన్స్‌కు చాలా ప్రతిష్టాత్మకమైంది. ప్రస్తుత సీజన్లో టోర్నీ నుంచి నిష్క్రమించే అంచున ఉన్న బ్లూ టీమ్, యూసుఫ్ పఠాన్ వీరోచిత ప్రదర్శనతో విజయం సాధించడమే కాకుండా, సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం వెంటనే ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్లు వెస్టిండీస్ ఛాంపియన్స్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు.. దీంతో 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే, ఈ వికెట్ల పతనం మధ్యలో కీరన్ పొలార్డ్ మెరుపుదాడి చేశాడు. ఈ పవర్-హిట్టర్ కేవలం 43 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేసి, వెస్టిండీస్‌ను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగుల పోరాడే స్కోరుకు చేర్చాడు. డ్వేన్ స్మిత్ 20 పరుగులు చేయగా, వెస్టిండీస్ బ్యాట్స్మెన్లలో మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. బౌలింగ్‌లో ఇండియా ఛాంపియన్స్ అద్భుతంగా రాణించింది. పియూష్ చావ్లా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ చెరో రెండు వికెట్లు తీయగా, పవన్ నేగి ఒక వికెట్ పడగొట్టాడు.
సెమీఫైనల్లో చోటు దక్కించుకోవడానికి 145 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో ఛేదించాల్సిన ఇండియా ఛాంపియన్స్‌కు ఆరంభంలో తడబడింది. 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, ఆ తర్వాత స్టువర్ట్ బిన్నీ, కెప్టెన్ యువరాజ్ సింగ్ మధ్య అద్బుతమైన పార్టనర్ షిప్ ఏర్పడింది. వీరిద్దరూ ఐదవ వికెట్‌కు కేవలం 27 బంతుల్లో 66 పరుగులు జోడించారు. యువరాజ్ 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కేవలం 11 బంతుల్లో 21 పరుగులు బాదాడు.
యువరాజ్ అవుటైన తర్వాత, యూసుఫ్ పఠాన్ బిన్నీతో జతకట్టాడు. ఈ జోడీ కేవలం 8 బంతుల్లో 30 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను స్టైల్‌గా ముగించింది. బిన్నీ 21 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేయగా, యూసుఫ్ పఠాన్ కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యూసుఫ్ భారీ సిక్సర్‌తో విజయాన్ని ఖరారు చేసి ఇండియా ఛాంపియన్స్‌ను సెమీఫైనల్లోకి తీసుకెళ్లాడు. శిఖర్ ధావన్ కూడా 18 బంతుల్లో 25 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. వెస్టిండీస్ తరఫున డ్వేన్ స్మిత్, డ్వేన్ బ్రావో చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, భారత బ్యాట్స్మెన్ల దూకుడును ఆపలేకపోయారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..