కొద్దిగా ఆకలి వేయగానే వెంటనే బిస్కెట్ల కోసం మన చేతులు వెళ్తుంటాయి. అయితే బిస్కెట్లు ఆరోగ్యకరమైనవిగా కనిపించినా.. అవి ఎక్కువగా శుద్ధి చేసిన పిండి, ఎక్కువ చక్కెర, పామాయిల్‌తో తయారు చేస్తారు. ఇవి శరీరానికి మంచివి కాకపోవచ్చు. పైగా కొవ్వు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో బిస్కెట్లకు బదులుగా మన ఇంట్లోనే తక్కువ కేలరీలతో ఆరోగ్యానికి మేలు చేసే చిరుతిండ్లను ప్రయత్నించండి.
ఉడికించిన చనా
కొన్ని శెనగలు తీసుకొని ఉప్పు వేసి బాగా ఉడకబెట్టండి. తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి దానికి తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం కలపండి. మీకు ఇష్టమైతే చాట్ మసాలా చల్లవచ్చు. ఇది తక్కువ కేలరీలతో ఉండే చిరుతిండి మాత్రమే కాదు.. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా అందిస్తుంది. ఇది సుమారు 80 నుంచి 90 కేలరీలలోపే ఉంటుంది.
మసాలా మజ్జిగ
ఒక అర కప్పు పెరుగును తీసుకొని చల్లటి నీటితో కలపండి. ఆ మిశ్రమంలో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, తరిగిన పుదీనా, చిటికెడు ఇంగువ కలిపి బాగా కలపండి. ఈ మజ్జిగ ఆరోగ్యానికి మంచిది. దాహాన్ని తగ్గించడమే కాదు.. జీర్ణవ్యవస్థకు కూడా సహాయపడుతుంది. ఇది తక్కువగా అంటే 50 కేలరీలలోపే ఉంటుంది.
చాట్ మసాలాతో పండ్లు
మీ దగ్గర ఉన్న జామ, యాపిల్ లేదా బొప్పాయిని చిన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకోండి. ఆపై చాట్ మసాలా చల్లి కొద్దిగా నిమ్మరసం పిండితే చాలు. ఇది మీకు సహజ తీపితో పాటు విటమిన్ సి, ఫైబర్ అందించే ఆరోగ్యకరమైన స్నాక్ అవుతుంది. ఇది సుమారు 60 నుంచి 70 కేలరీలలోపే ఉంటుంది.
ఇడ్లీతో టేస్టీ ఫ్రై
ముందు రోజు మిగిలిన ఇడ్లీలను చిన్న ముక్కలుగా కట్ చేసి అర టీస్పూన్ నూనె వేసిన పాన్ లో వేయించండి. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి చిటికెడు సాంబార్ పొడి కలిపితే అంచులు కొంచెం కరకరలాడతాయి. ఇది త్వరగా తయారయ్యే, రుచికరమైన, తక్కువ నూనెతో ఉండే అల్పాహారం. ఇది సుమారు 90 కేలరీలలోపే ఉంటుంది.
బిస్కెట్లకు బదులుగా.. మఖానా, ఉడికించిన శెనగలు, మసాలా మజ్జిగ, చాట్ మసాలా పండ్లు, ఇడ్లీ ఫ్రై లాంటి స్నాక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి కేవలం తక్కువ కేలరీలతో ఉండటమే కాదు.. శక్తినిస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి.