భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీ జంటలలో ఒకరైన విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ తాజాగా దుబాయ్ పర్యాటక విభాగం చేపట్టిన సరికొత్త ప్రచార కార్యక్రమంలో భాగమయ్యారు. “దుబాయ్, రెడీ ఫర్ ఎ సర్‌ప్రైజ్” అనే ఈ ప్రచారానికి విజిట్ దుబాయ్ (దుబాయ్ కార్పొరేషన్ ఫర్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్) శ్రీకారం చుట్టింది. ఇందులో విరాట్, అనుష్క దుబాయ్ నగరంలోని అంతగా తెలిసి ఉండని, కానీ ఎంతో ఆకట్టుకునే ప్రదేశాలను అన్వేషిస్తూ ఒక ప్రయాణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ ప్రచారంలో ఈ జంట కలిసి గమ్యస్థాన-కేంద్రీకృత పర్యాటన ప్రచారంలో తొలిసారిగా పాల్గొంటుండటం విశేషం. దుబాయ్‌ను తమ రెండవ ఇల్లుగా భావించే ఈ జంట, నగరంలోని అంతర్లీన అందాలు, వినోదాన్ని, సాహసానుభవాలను అన్వేషిస్తూ, ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన అనుభూతికి తీసుకెళుతున్నారు.
ఈ ప్రచారంలోని ప్రధాన ఆకర్షణగా, విరాట్ అనుష్కకు ప్రత్యేకంగా ఆమె అభిరుచులకు అనుగుణంగా ఒక రోజును ప్లాన్ చేస్తాడు. దీనిలో ప్రపంచంలోనే ఎత్తైన 360 డిగ్రీల అనంత కొలను అయిన AURA SKYPOOL వద్ద విశ్రాంతి, దుబాయ్ బీచ్‌లపై పారాసెయిలింగ్ వంటి వినోదభరితమైన అనుభవాలు ఉన్నాయి. ఈ వీడియోలో వారు పరస్పరాన్ని ఆశ్చర్యపరుస్తూ, ఆనందభరిత క్షణాలను పంచుకుంటారు. వీడియోలో కనిపించే సరదా, సాహసం, ఆహారం, సంగీతం ద్వారా దుబాయ్ నగరాన్ని వారు మరింత భావోద్వేగపూరితంగా చూపిస్తున్నారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియో, దుబాయ్‌ను చూడటానికి కొత్త కోణాన్ని అందించడమే కాక, అందులో ఇంకా ఎంతో అన్వేషించదగిన ప్రదేశాలు ఉన్నాయన్న భావనను కలిగిస్తుంది.
విజిట్ దుబాయ్ సిఇఒ ఇస్సామ్ కాజిమ్ మాట్లాడుతూ, విరాట్, అనుష్కలతో భాగస్వామ్యం సహజంగా ఏర్పడిందని, దుబాయ్ పట్ల వారికి ఉన్న ప్రేమ, వారి ప్రజలతో ఉండే అనుబంధం వారిని నగరానికి సరైన అంబాసిడర్లుగా మార్చిందని తెలిపారు. నిజానికి ఈ జంట భారతదేశంలో “పవర్ కపుల్”గా ప్రసిద్ధి పొందింది. 2017లో ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లల తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విరాట్ క్రికెట్ మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తుండగా, అనుష్క తరచుగా స్టేడియంలో ఆయనను ప్రోత్సహిస్తూ కనిపించడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేస్తుంది.
ఇటీవల కూడా ఈ జంట IPL 2025 ఫైనల్‌కు ముందు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఎప్పటిలాగే స్టైలిష్ లుక్‌లో, ప్రేమతో కనిపించిన ఈ జంట అభిమానుల మనసులను మళ్లీ గెలుచుకుంది. రజత్ పటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి ఫైనల్స్‌కి చేరిన నేపథ్యంలో, వారి అభిమానం, ప్రచారాలకు ఈ జంట మరింత ఆకర్షణగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..