Virat Kohli : భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా, ఆస్ట్రేలియా సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల నుంచి విమర్శలకు గురికావడంతో, పఠాన్ ఇప్పుడు వాటిపై స్పందించారు. కోహ్లీ 2024-25లో ఆస్ట్రేలియా పర్యటనలో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యారు. తన బ్యాటింగ్ ఫామ్‌లో తగ్గుదల కనిపించిన సమయంలోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇర్ఫాన్ పఠాన్ ‘లల్లన్‌టాప్’తో మాట్లాడుతూ.. తన విమర్శలను సమర్థించుకున్నారు. “నా సోషల్ మీడియా చూస్తే, 2019-20లో విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయినప్పుడు నేను అతనికి సపోర్టు ఇచ్చాను. ఆ సమయంలో అది కోవిడ్ వల్ల జరిగింది. ఒక పెద్ద ఆటగాడు మొదటిసారి ఫామ్ కోల్పోయినప్పుడు అతనికి సపోర్టు ఇవ్వాలి. అతడు దానికి అర్హుడు, చాలా మ్యాచ్‌లను గెలిపించాడు. కానీ, ఒకవేళ ఫామ్ ఐదేళ్లు కొనసాగితే, అది సరైనది కాదు” అని పఠాన్ అన్నారు.
ఇర్ఫాన్ పఠాన్ ఎల్లప్పుడూ జట్టు గెలుపే మెయిన్ అని నొక్కి చెప్పారు. “చివరకి జట్టు విజయం ముఖ్యం. జట్టు నంబర్ 1, మనం జట్టు కోసం ఆడతాం, గెలవడానికి ఆడతాం. ఒక బ్యాట్స్‌మెన్ ఒకే విధంగా ఔట్ అవుతుంటే, ప్రత్యర్థి జట్టు అదే విధంగా ప్లాన్ చేస్తుంది. వారు ప్లాన్ ‘ఎ’ను వదిలి ప్లాన్ ‘బి’కి వెళ్లరు. మీరు ఛాంపియన్ ప్లేయర్ అయితే, మీరు వారి ప్లాన్ ‘ఎ’ నుండి ప్లాన్ ‘బి’కి మార్చగలగాలి. కానీ, టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సమస్య ఏమిటంటే, అతను పదే పదే ఒకే విధంగా ఔట్ అవుతున్నాడు. దీని అర్థం అతను చెడ్డ ఆటగాడని కాదు. అతను ఒక ఛాంపియన్ ప్లేయర్, కానీ అయినా ఇదే జరుగుతోంది” అని ఆయన వివరించారు.
ఒక కామెంట్రీగా తన బాధ్యత గురించి కూడా పఠాన్ వివరించారు. “ఒక బ్రాడ్‌కాస్టర్‌గా, కామెంట్రీ చేస్తున్నప్పుడు, అభిమానులు మ్యాచ్ చూస్తున్నప్పుడు, మీరు దృశ్యాలకు అనుగుణంగా ఏం జరుగుతుందో చెప్పాలి. ఒక బ్రాడ్‌కాస్టర్, కామెంటర్ పని – ఏమి జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, ఏం జరగవచ్చు, ఎలా జరుగుతుంది అని వివరించడం. ఒక ఆటగాడు అద్భుతంగా ఆడుతుంటే మీరు ప్రశంసిస్తారు, బాగా ఆడకపోతే విమర్శిస్తారు. కామెంటర్ల బాధ్యత ఆటగాళ్ల పట్ల కాదు, అభిమానుల పట్ల” అని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..