పెళ్లంటే మధుర క్షణాల సమ్మేళనం. కానీ ఆ పెళ్లి వేడుక పర్యావరణానికి హాని చేయొద్దని నిరూపించింది చెన్నయ్‌కి చెందిన లైఫ్ స్టయిల్ బ్లాగర్ ఉమా రాఘవన్. అతి తక్కువ వ్యర్థాలతో చెప్పాలంటే జీరో వేస్ట్‌తో పెళ్లి చేసుకుందామె. మనోళ్లకు పెళ్లంటే ముందుగా గుర్తుకొచ్చేది మాంచి దావత్. తీరొక్క వంటకాలతో పసందైన విందు ఇవ్వాలనుకుంటారు. పెళ్లి ఎంత గ్రాండ్‌గా అయిందనేది వంటకాల మీదనే ఆధారపడి ఉంటుందనుకుంటారు. ఉమ పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. వంటకాల ప్రిపరేషన్ కోసం ఫ్యామిలీ అంతా తలమునకలైతే.. ఉమ “అవేవీ వద్దు” అనేసింది. ఫ్యామిలీ షాక్ అయ్యింది. “వంటల్లేనిదే పెళ్లెక్కడిది.?” అన్నారు. “వంటలు వద్దని చెప్పడం లేదు.. వ్యర్థాలు తగ్గిద్దాం” అని కుటుంబానికి.. వరుడి ఇంటివాళ్లకు సముదాయించి చెప్పింది. “కనెక్ట్ టు ఎర్త్” అనే ఎన్జీవో సహాయంతో పెళ్లిలోని భోజన వ్యర్థాలను వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో పశువులకు ఆహారంగా అందించారు. ఎండిన పూల దండలు, మావిడాకులు, పండ్ల తొక్కలను తడి.. పొడి వ్యర్థాలుగా విభజించి ఎరువుగా మార్చారు.
ఉమారామ్ తన పెళ్లిలో మొత్తం 110 కిలోల వ్యర్థాలను మళ్లించి.. తక్కువ వ్యర్థాలతో పెళ్లి చేసుకుంది. క్యాటరింగ్ బృందం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను కొనుగోలు చేసింది. కానీ ఉమ వెనక్కి తగ్గలేదు. మిగిలిన నీటిని మొక్కలకు పోసి.. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించింది. ఈ విధంగా అతిథులకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మంచి ప్రయత్నం చేశారు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా దీని గురించే చర్చించుకున్నారు. దీంతో తన కాన్సెప్ట్ పదిమందికి అర్థమయ్యేలా తన పెళ్లిని వేదికగా మల్చింది ఉమారామ్.
పూర్తి జీరో వేస్ట్ వివాహం సాధ్యం కాకపోయినా మార్పు కోసం ఆమె ఒక మంచి ప్రయత్నమైతే చేసింది. తక్కువ వ్యర్థ ఈవెంట్ ఆలోచనను ప్రచారం చేసేందుకు సినీ తారల చిత్రాలతో కూడిన ఆకర్షనీయమైన పోస్టర్లను ముద్రించింది. అతిథులకు పంపిన వివాహ ఆహ్వాన పత్రికలను కూడా సీడ్ పేపర్‌తో తయారుచేయించింది. తద్వారా అవి పెళ్లి తర్వాత మొక్కలుగా మారి.. ఈ జంటను గుర్తుచేసే జ్ఞాపకంగా నిలిచాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా 110 కిలోల వ్యర్థాలు డస్ట్‌బిన్‌లో చేరకుండా రీసైక్లింగ్ అయ్యాయి.