ఇజ్రాయెల్ తగ్గేదే లే అంటోంది. మొన్నటి వరకు ఇరాన్‌పై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్.. తాజాగా సిరియాపై ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది ఇజ్రాయెల్. వైమానిక దాడులతో వణికిపోయారు సిరియన్లు. డ్రూజ్ వర్గంపై దాడులు ఆపి, సిరియన్ సైన్యం వెనక్కి వెళ్లాలని హెచ్చరించింది ఇజ్రాయెల్. సిరియాలోని ఆర్మీ సహా పలు ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది ఇజ్రాయెల్. రాజధాని డమాస్కస్‌లోని అధ్యక్షుడి భవనంతో పాటు.. రక్షణశాఖ ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ దాడులతో వణికిపోయారు జనం. సిరియా సైన్యం కూడా పరుగులు పెట్టింది.
అధికారిక మీడియా కేంద్రం ఉన్న భవనంపైనా వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్. లైవ్ కొనసాగుతున్న సమయంలోనే బాంబులు వేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఉలిక్కిపడిన ఓ మహిళా యాంకర్.. అక్కడ నుంచి పరుగెత్తింది.
వీడియో చూడండి:
החלו המכות הכואבות pic.twitter.com/1kJFFXoiua
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) July 16, 2025
డమాస్కస్‌కు ఇచ్చిన హెచ్చరికలు ముగిశాయి. ఇక బాధాకరమైన దాడులు తప్పవన్నారు ఇజ్రాయెల రక్షణశాఖ మంత్రి కట్జ్. డ్రూజ్‌లపై దాడి చేసిన బలగాలను ఉపసంహరించుకునే వరకు ఐడీఎఫ్ దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తాయన్నారు. డ్రూజ్ సోదరులారా.. మిమ్మల్ని రక్షించడానికి ఐడీఎఫ్ దళాలు పని చేస్తాయని హామీ ఇచ్చారు కట్జ్. డ్రూజ్ వర్గానికి ఇతరులకు మధ్య కొనసాగుతున్న వర్గపోరులో ఇజ్రాయెల్ ఇటీవల జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌లోని డ్రూజ్ వర్గాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన కట్జ్.. వారికి అండగా ఉంటామన్నారు. అంతకుముందు స్వీడా నగరంలోకి వెళ్లిన సిరియా దళాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. స్వీడా నుంచి సిరియన్ దళాలు వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేశారు.