ఏనుగు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందే. అంతే తెలివైన జంతువు కూడా. ఏనుగు తన దంతాల సాయంతో పెద్ద పెద్ద బరువులను ఎత్తి పడేయగలదు. అలాంటి ఓ ఏనుగు నదిలో కారు చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న కొందిరికి సాయం చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఘటన కేరళలో జరిగింది. ఈ ఏనుగుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో… ఓ తెల్లటి టయోటా ఫార్చ్యూనర్ కారు నదిలో మునిగిపోయింది. సగానికి పైగా మునిగిపోయిన ఆకారు ముందు ఎడమ చక్రం మాత్రమే పైకి కనిపిస్తోంది. పరిస్థితి చేయిదాటిపోయిందని అనిపించిన సమయంలో, ఓ మావటి తన ఏనుగు ‘తిరువెంగప్పుర శంకరనారాయణన్’తో కలిసి అక్కడకు వచ్చాడు. ఆ తర్వాత, దాదాపు రెండున్నర టన్నులకు పైగా బరువున్న ఆ భారీ వాహనాన్ని శంకరనారాయణన్ అనే ఆ ఏనుగు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే విజయవంతంగా నీటిలోంచి బయటకు లాగింది.
టయోటా ఫార్చ్యూనర్ వాహనం పూర్తి బరువు సుమారు 2,510 కిలోల వరకు ఉంటుందని, అంత బరువైన కారును ఏనుగుఎంతో అవలీలగా బయటకు లాగేయడంతో అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏనుగు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తిరువెంగప్పుర శంకరనారాయణన్… మా చిన్న ఏనుగు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కష్ట సమయాల్లో ఈ గజరాజులు మానవులకు ఎంత విలువైన సహాయాన్ని అందించగలవో ఈ ఘటన నిరూపిస్తోంది అంటున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు శక్తి సామర్థ్యాలను, చురుకుదనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫార్చ్యూనర్ వాహనం ఏనుగు ముందు మారుతి 800లా కనిపిస్తోంది అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. అంత బరువైన కారును బొమ్మను లాగినట్లు లాగి పడేసిందిగా అంటూ ఇంకొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.