
ఎనిమిది సంవత్సరాలుగా తన ఛాతీలో కత్తితో జీవిస్తున్నాడు ఓ వ్యక్తి. ఇటీవల టెస్టుల నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి దెబ్బకు షాక్ అయ్యారు వైద్యులు. వివరాల్లోకి వెళ్తే.. 44 ఏళ్ల సదరు వ్యక్తి తన కుడివైపు ఛాతి కింద ఇన్ఫెక్షన్ కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి వచ్చాడు. అతడికి ఇతర ఏ ప్రాణాంతక లక్షణాలు లేకపోగా.. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటం, దగ్గు లేదా జ్వరం లాంటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. దాదాపుగా దశాబ్దం క్రితం జరిగిన ఓ సంఘటనను ఆ వ్యక్తి డాక్టర్లకు చెప్పగా.. అది విని వారు తెగ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో తన ముఖం, వీపు, ఛాతి, ఉదరంపై అనేక గాయాలు అయ్యాయని.. అప్పుడు వైద్యులు తన గాయానికి చికిత్సను అందించారన్నారు.
తన కుడివైపు చనుమొన కింద చీము రావడాన్ని గమనించిన అతడు.. సరాసరి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఇక అతడి ఛాతీ రేడియోగ్రాఫ్ తీసిన డాక్టర్లు.. ఛాతీ మధ్యలో ఒక పెద్ద కత్తికి సంబంధించిన బ్లేడ్ ఇరుక్కుపోయినట్టు గమనించారు. ఎలాంటి ప్రధాన అవయవాలకు అది తగలకపోవడంతో.. సదరు రోగి ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. శస్త్రచికిత్స ద్వారా ఆ కత్తిని జాగ్రత్తగా తొలగించారు. అలాగే ఆ ప్రాంతం చుట్టూ ఏర్పడిన చీమును కూడా తీశారు డాక్టర్లు. అనంతరం 24 గంటల ఐసీయూ తర్వాత ఆ వ్యక్తిని జనరల్ వార్డుకు తరలించారు. వైద్యులు అతని పరిస్థితిని పర్యవేక్షించి 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. గత నెలలో జర్నల్ ఆఫ్ సర్జికల్ కేస్ రిపోర్ట్స్‌లో ఈ కేసును డాక్టర్లు పొందుపరిచారు. టాంజానియాలోని ముహింబిలి నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందిన సదరు రోగి.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేశారు.