ఒడిశాలోని నయాగఢ్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి Autosomal Dominant Polycystic Kidney Disease (ADPKD) అనే జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా అతని కుడి కిడ్నీలో పెద్ద ఎత్తున సిస్టులు (కణితులు) ఏర్పడి, వాటి మొత్తం బరువు 8.7 కిలోల వరకు పెరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద కిడ్నీ కణితిగా వైద్య చరిత్రలో నమోదు అయ్యింది.
ఈ భారీ కణితి వల్ల రోగి తీవ్ర స్థాయిలో పొట్ట నొప్పి, శ్వాసలో ఇబ్బంది, నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన జీవన నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈ పరిస్థితిలో, ఏఐఐఎంఎస్ భువనేశ్వర్ వైద్యుల బృందం క్షుణ్ణంగా పరీక్షించి, శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
డాక్టర్ మనోజ్ కుమార్ దాస్ నేతృత్వంలో వైద్యుల బృందం ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్ సమ్బిత్ త్రిపాఠి, డాక్టర్ సాహర్ష్, డాక్టర్ మిథ్లేష్, డాక్టర్ హుజైఫా, డాక్టర్ సబిక్, డాక్టర్ సచిన్ బృందంలో కీలక పాత్ర పోషించారు. అనస్తీషియా టీమ్‌ను డాక్టర్ పూజా బిహాని లీడ్ చేయగా, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, నర్సులు శ్రేయా, పరిణీత సాయం అందించారు. డాక్టర్ దాస్ మాట్లాడుతూ, ” నమ్మకం, టీమ్ కోఆర్డినేషన్ కారణంగానే ఇది సాధ్యమైంది” అని తెలిపారు. ఏఐఐఎంఎస్ భువనేశ్వర్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ బిశ్వాస్, ఉరాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రసాంత్ నాయక్ అందించిన ప్రోత్సాహం కీలకమైందని పేర్కొన్నారు.
ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం స్థిరంగా ఉంది. శస్త్రచికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. వైద్య బృందం నిరంతరం పర్యవేక్షణ ద్వారా రోగికి తగిన చికిత్స అందిస్తోంది. ఇంత భారీ కిడ్నీ కణితిని తొలగించడం వైద్య చరిత్రలో అరుదైన ఘట్టంగా చెబుతున్నారు. ఇది ఏఐఐఎంఎస్ భువనేశ్వర్ వైద్య నైపుణ్యాన్ని, ఆధునిక వైద్య సాంకేతికతను ప్రతిబింబించే ఉదాహరణగా నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..