రంగులు మార్చే గణేశ విగ్రహం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళపురంలోని శ్రీ మహాదేవ ఆలయంలోని బహిరంగ ప్రదేశంలో రాజ వృక్షం కింద ఉంది. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా.. అయితే ఈ ఆలయ ప్రాశస్త్యం మాత్రం చాలా గొప్పది. ఎందుకంటే వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగుని మార్చుకోవడమే.. ఈ వినాయకుడు మొదటి ఆరు నెలలు ఒక రంగులో, తరువాతి ఆరు నెలలు మరో రంగులో ఉంటాడు. ఈ వినాయక విగ్రహం 2300 సంవత్సరాల నాటిదని చెబుతారు.
తమిళ క్యాలెండర్ ప్రకారం.. తై మాసం నుంచి ఉత్తరాయణ కాలం అయిన ఆణి వరకు అంటే.. మార్చి నుంచి జూన్ వరకూ వినాయకుడు నల్లగా కనిపిస్తాడు. ఆషాడ మాసం నుండి దక్షిణాయన కాలం అయిన మార్గశిర మాసం వరకు అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ వినాయకుడు తెల్లగా కనిపిస్తాడు. ఆషాడం మాసం వచ్చినప్పుడు.. వినాయకుడు నల్ల రంగు నుంచి క్రమంగా తెల్లగా మారతాడు. అదేవిధంగా.. ఉత్తరాయణ కాలం ప్రారంభమైనప్పుడు, చిన్న నల్ల చుక్కలు వినాయకుడిపై రావడం మొదలవుతాయి.. క్రమంగా నల్లగా మారతాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. రంగు మారే ఈ అద్భుత వినాయకుడిని చూస్తే మన జీవితాల్లో కూడా ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
రంగులు మార్చుకునే నీరు
ఈ ఆలయంలోని మరో అద్భుతం ఇక్కడ ఉన్న బావి నీరు. వినాయకుడు రంగు మారే వ్యక్తి అయితే.. ఇక్కడ ఉన్న బావి నీరు కూడా రంగులు మార్చుకుంటుంది. వినాయకుడు తెల్లగా ఉంటే బావి నీరు నల్లగా ఉంటుంది. వినాయకుడు నల్లగా ఉంటే బావి నీరు స్పష్టంగా, తెల్లగా ఉంటుందని అంటారు.
మరో విచిత్రం ఏమిటంటే
శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి నియమం. అయితే ఈ ఆలయంలో ఉన్న మఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని భక్తులు మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
ఆలయ చరిత్ర ఏమిటంటే
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని.. 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని చరిత్రకారుల అంచనా. అద్భుతాలు దాచుకున్న ఈ ఆలయం నిజానికి శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. కాలక్రమంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.
ఈ అద్భుత గణేశ విగ్రహాన్ని ట్రావెన్‌కోర్ రాజు కేరళవర్మన్ తంబురాన్ రామేశ్వరం సముద్రంలో పవిత్ర స్నానం చేస్తున్నప్పుడు కనిపించింది. ఆరు అంగుళాల గణేశ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వకపోతే .. దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించి.. రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళపురం రాజుకి ఇస్తూ.. మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడట.
కేరళపురం రాజు రెండు గణపతి విగ్రహాలను తీసుకొచ్చి ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా తన రాజ్యంలో ప్రతిష్టించాడు. తురుష్కుల దండయాత్రలో మరకత గణపతిని తీసుకుని వెళ్ళిపోగా.. సముద్రంలో దొరికిన గణపతి మాత్రం మిగిలిపోయాడు. ఇక్కడ ఉంచిన తర్వాత వినాయక విగ్రహం క్రమంగా పెరిగిందని చెబుతారు. గణేశ విగ్రహం రంగు మారడానికి కారణం ఈ విగ్రహం చంద్రకాంతం అనే అరుదైన రాయితో తయారు చేయబడింది. ఎవరైనా గణపతికి కొబ్బరికాయను లేదా బియ్యం ముడుపు కట్టి చెల్లిస్తే కోరిక నెరవేరుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.