Major League Cricket 2025: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 సీజన్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ సంచలనం సృష్టించాడు. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తరపున వాషింగ్టన్ ఫ్రీడమ్ పై అలెన్ కేవలం 51 బంతుల్లో 151 పరుగులు చేసి, టీ20 క్రికెట్ చరిత్రలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 123 పరుగుల భారీ తేడాతో వాషింగ్టన్ ఫ్రీడమ్ ను చిత్తు చేసింది.
సిక్సర్ల సునామీ: క్రిస్ గేల్ రికార్డు బద్దలు..!
ఫిన్ అలెన్ ఇన్నింగ్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం అతను బాదిన సిక్సర్ల సంఖ్య. అలెన్ 19 సిక్సర్లు కొట్టి, టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ (18 సిక్సర్లు) రికార్డును అధిగమించాడు. 2017లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో రంగపూర్ రైడర్స్ తరఫున క్రిస్ గేల్ ఈ రికార్డును నెలకొల్పగా, ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ కూడా 2024లో 18 సిక్సర్లతో ఈ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు ఫిన్ అలెన్ 19 సిక్సర్లతో వారిద్దరినీ అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
రికార్డుల పరంపర..
Finn Allen’s out here breaking records 💯 He smashed the fastest century in MLC history for the @SFOUnicorns! 🔥 pic.twitter.com/SVyQ9n99Rf
— Cognizant Major League Cricket (@MLCricket) June 13, 2025
వేగవంతమైన 150: అలెన్ తన 150 పరుగులను కేవలం 49 బంతుల్లోనే సాధించి, టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు డెవాల్డ్ బ్రేవస్ (52 బంతులు) పేరిట ఉండేది.
MLCలో అత్యధిక వ్యక్తిగత స్కోరు: ఫిన్ అలెన్ 151 పరుగుల ఇన్నింగ్స్ MLC చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. గతంలో నికోలస్ పూరన్ 2023 ఫైనల్ లో చేసిన 137 పరుగులే అత్యధికం.
MLCలో వేగవంతమైన సెంచరీ: అలెన్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, MLCలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఇది టీ20 ఫ్రాంచైజీ లీగ్ లలో క్రిస్ గేల్ (30 బంతులు, ఐపీఎల్ 2013) తర్వాత రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ.
MLCలో అత్యధిక టీమ్ స్కోరు: శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్ పుణ్యమా అని 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఇది MLC చరిత్రలో అత్యధిక టీమ్ స్కోరుగా నిలిచింది. అమెరికా గడ్డపై టీ20 మ్యాచ్ లో 200 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా యునికార్న్స్ నిలిచింది.
MLCలో అత్యధిక పరుగుల తేడాతో విజయం: 123 పరుగుల తేడాతో గెలిచిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, MLC చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.
వాషింగ్టన్ ఫ్రీడమ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన గ్లెన్ మాక్స్ వెల్, అలెన్ బ్యాటింగ్‌ను అభినందించాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని, బౌండరీలు చిన్నవిగా ఉన్నాయని, కానీ అలెన్ ఆధిపత్యం తమ ప్రణాళికలను దెబ్బతీసిందని పేర్కొన్నాడు.
ఫిన్ అలెన్ ఈ రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ తో మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. రాబోయే మ్యాచ్ లలో మరిన్ని అద్భుత ప్రదర్శనలను ఆశించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..