Vaibhav Suryavanshi: భారత అండర్-19 జట్టులో యువ సంచలనం, స్టార్ బ్యాట్స్ మెన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై తన బ్యాట్ తో అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కేవలం 90 బంతుల్లో 190 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, అతని ఈ విధ్వంసకర ప్రదర్శన వెనుక ఉన్న రహస్యాన్ని అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా తాజాగా వెల్లడించారు.
డ్యూక్ బంతితో ప్రత్యేక శిక్షణ..
వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌లో ఆడుతున్న డ్యూక్ బంతితో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడని కోచ్ మనీష్ ఓఝా తెలిపారు. ఈ బంతి ఇంగ్లాండ్ పిచ్ లలో బౌలర్లకు ఎక్కువ స్వింగ్, సీమ్ అందిస్తుంది. అందుకే, అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి, డ్యూక్ బంతితో సాధన చేయడం చాలా అవసరం. ఈ డ్యూక్ బంతి ధర భారత మార్కెట్లో సుమారు 10,000 రూపాయలు ఉంటుందని కోచ్ వెల్లడించారు.
పవర్ హిట్టింగ్‌పై దృష్టి..
వైభవ్ చిన్నప్పటి నుంచీ పవర్ హిట్టింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. కోచ్ ఓఝా, అతనికి ఫుల్ టాస్ బంతులను వేస్తూ, బ్యాట్‌ను పైకి లేపి, బంతిని సరిగ్గా టైమింగ్ చేస్తూ, వీలైనంత ఎక్కువ శక్తితో కొట్టేలా శిక్షణ ఇచ్చారు. కట్స్, పుల్స్, బ్యాక్-ఫుట్ పంచ్‌లు, లిఫ్ట్‌లు వంటి అన్ని షాట్ లపైనా నిరంతరం సాధన చేయించాడు. యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ లాగా తన బ్యాక్ లిఫ్ట్, హ్యాండ్ ఎక్ స్ టెన్షన్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టించాడు.
ప్రతిరోజూ 350-400 బంతులు..
వైభవ్ సూర్యవంశీ ప్రతిరోజూ నెట్ లో 350-400 బంతులను ఎదుర్కొనేవాడు. బేసిక్ డ్రిల్స్, రోబో త్రోడౌన్స్, లైవ్ బౌలింగ్, ఫీల్డ్ ప్లేస్ మెంట్ ఛాలెంజ్‌లతో కూడిన క్రమబద్ధమైన శిక్షణ అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని పెంచింది. అతని బ్యాటింగ్‌లో కనిపించే ఆత్మవిశ్వాసం, బంతిని బౌండరీలు దాటించే నైపుణ్యం ఈ కఠినమైన శిక్షణ ఫలితమే అని కోచ్ అన్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన..
ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మొదటి వన్డేలో వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 48 పరుగులు (5 సిక్సర్లతో సహా) చేసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో వన్డేలో కూడా 34 బంతుల్లో 45 పరుగులు (3 సిక్సర్లతో సహా) చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి, 35 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన సత్తా చాటుతున్నాడు.
వైభవ్ సూర్యవంశీకి వయసు తక్కువే అయినప్పటికీ, అతని కఠోర సాధన, అంకితభావం, కోచ్ మార్గదర్శకత్వం అతన్ని ఒక అద్భుతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాయి. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అతని ప్రదర్శన స్పష్టం చేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..