హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 6వ తేదీన లాసెట్ నిర్వహించనున్న సంగతి తెలిసింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూన్ 6వ తేదీన మూడు విడతలుగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 57,715 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకి 41,210 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీకి (ఇంటర్ విద్యార్హతతో రాసే ప్రవేశ పరీక్ష) 11,695 మంది, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 4,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఈ పరీక్షల హాల్ టికెట్లను కూడా జారీ చేశారు. వీరందరికీ శుక్రవారం (జూన్ 6) రాత పరీక్ష నిర్వహించనున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తమతోపాటు హాల్‌టికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
జూన్ 23 వరకు ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు
తెలంగాణ ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధినులు జూన్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుతో పాటు పదోతరగతి మార్కుల మెమో, ఇంటర్‌మార్కుల మెమోను జత చేయాలని, అలాగే ఈ ఏడాది జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలు, ఐదు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకుని సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు గురుకుల వెబ్‌సైట్‌తోపాటు 040-23391598 ఫోన్ నంబరును సంప్రదించవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.