
ఉదయాన్నే దంతాలు శుభ్రం చేసుకోవడానికి వాడే టూత్‌పేస్ట్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కొన్ని టూత్‌పేస్ట్‌లలో జంతువుల నుంచి సేకరించిన పదార్థాలు ఉండవచ్చు. మీరు శాఖాహారులైతే, మీ టూత్‌పేస్ట్ ఏ రకానికి చెందినదో తెలుసుకోవడం ముఖ్యం.
మనలో చాలా మంది టూత్‌పేస్ట్‌ను కొనుగోలు చేసేటప్పుడు దాని రుచి, బ్రాండ్ లేదా తెల్లబడటం వంటి ప్రకటనలపైనే దృష్టి పెడతారు కానీ, అందులో వాడిన పదార్థాలను పరిశీలించరు. శాఖాహారులు, నాన్-వెజ్ ఆహారానికి దూరంగా ఉండేవారు తమ టూత్‌పేస్ట్ స్వభావాన్ని తెలుసుకోవడం అవసరం. టూత్‌పేస్ట్ వెజ్ అవునా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
టూత్‌పేస్ట్‌లో నాన్-వెజ్ ఉంటుందా?
టూత్‌పేస్ట్‌లో నాన్-వెజ్ పదార్థాలుంటాయా లేదా అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పరిశోధకులు టూత్‌పేస్ట్ తయారీకి నాన్-వెజ్ పదార్థాలు అవసరం లేదని తేల్చారు. టూత్‌పేస్ట్‌లో ప్రధానంగా ఫ్లోరైడ్, అబ్రాసివ్‌లు, హ్యూమెక్టెంట్లు (గ్లిజరిన్) వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని కంపెనీలు జంతువుల ఎముకల నుంచి సేకరించిన ఉత్పన్నాలను టూత్‌పేస్ట్‌లో ఉపయోగిస్తాయి. దీంతో టూత్‌పేస్ట్ నాన్-వెజ్ కావచ్చు. అలాగే, టూత్‌పేస్ట్‌లో ఎక్కువగా ఉపయోగించే గ్లిజరిన్ కూడా మొక్కల ఆధారితంగా లేదా జంతువుల చర్మం వంటి వాటి నుంచి తయారవుతుంది. ఈ తేడాని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
ప్యాకేజింగ్‌పై గుర్తులు:
చాలా కంపెనీలు తమ ఉత్పత్తులు శాఖాహారమా కాదా అని ప్యాకేజింగ్‌పై స్పష్టంగా సూచిస్తాయి.
టూత్‌పేస్ట్ ప్యాకేజింగ్‌పై ఆకుపచ్చ చుక్క ఉంటే, అది పూర్తిగా శాఖాహారం (వెజ్), అంటే అందులో ఎలాంటి జంతు ఉత్పన్నం లేదని అర్థం.
ప్యాకేజీపై గోధుమ లేదా ఎరుపు చుక్క ఉంటే, ఆ టూత్‌పేస్ట్ నాన్-వెజ్ అని, దానిని తయారు చేయడంలో జంతు ఉత్పన్నాలను ఉపయోగించారని అర్థం.
కొన్ని బ్రాండ్‌లు ప్రత్యేకంగా వీగన్ (జంతువుల నుంచి తయారైన ఏ పదార్థాలను ఉపయోగించలేదని) అని సూచించే లోగోలను కూడా ఉపయోగిస్తాయి.
పదార్థాల జాబితాను తనిఖీ చేయండి:
టూత్‌పేస్ట్ తయారీకి ఉపయోగించిన పదార్థాల శాతం దాని ప్యాకేజింగ్‌పై ముద్రించి ఉంటుంది. ఈ జాబితాను జాగ్రత్తగా చదవాలి.
గ్లిజరిన్: ప్యాకేజింగ్‌పై ‘వెజిటబుల్ గ్లిజరిన్’ అని రాసి ఉంటే అది శాఖాహారం. ‘గ్లిజరిన్’ అని మాత్రమే ఉంటే అది జంతువుల ఆధారితమైంది అయ్యే అవకాశం ఉంది.
కాల్షియం ఫాస్ఫేట్, జెలటిన్, స్టీరిక్ యాసిడ్: ఈ పదార్థాలు కూడా జంతువుల ఆధారితమైనవి కావచ్చు. వాటి మూలం స్పష్టంగా పేర్కొనబడకపోతే (వెజ్ లేదా నాన్-వెజ్ అని), అవి జంతువుల ఆధారితమైనవి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి టూత్‌పేస్ట్‌లను కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి.
బ్రాండ్ వెబ్‌సైట్ లేదా కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి:
మీ గందరగోళం ఇంకా తొలగకపోతే, టూత్‌పేస్ట్ తయారీ కంపెనీ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి. చాలా బ్రాండ్‌లు తమ ఉత్పత్తి గురించి, తయారీ ప్రక్రియ గురించి అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందిస్తాయి. అంతేకాకుండా, బ్రాండ్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించడం ద్వారా కూడా మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.
వీగన్ లేదా శాఖాహార సర్టిఫైడ్ బ్రాండ్‌లను ఎంచుకోండి: ఈ రోజుల్లో, చాలా కంపెనీలు ప్రత్యేకంగా శాఖాహారుల కోసం టూత్‌పేస్ట్‌లను తయారు చేస్తున్నాయి. ఇలాంటి బ్రాండ్‌లు తమ ఉత్పత్తులు పూర్తిగా శాఖాహారమని స్పష్టంగా ప్రకటిస్తాయి. ప్లాంట్-ఆధారిత పదార్థాలను మాత్రమే ఉపయోగించే బ్రాండ్‌లను ఎంచుకోవడం వల్ల మీకు ఎలాంటి సందేహాలు లేకుండా ఉంటాయి