హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆగస్టు 21 (గురువారం) ఓ ప్రకటనలో తెలిపింది. ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలతో వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఈ మేరకు నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేసే పోస్టులను తెలంగాణ వైద్య విద్య విధాన పరిషత్తులోని ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత తీరుతుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అంతేకాకుండా జిల్లా, ఏరియా ఆసుపత్రులతో పాటు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వైద్య సేవలు మెరుగుపడనున్నాయి.
కాగా రాష్ట్ర ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను రేవంత్ సర్కార్ భర్తీ చేసింది. వివిధ హోదాల్లో కలిపి మరో 7 నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అంతేకాకుండా ఇటీవలే 607 పోస్టులను నింపేందుకు భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. దీనితోపాటు 1 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుకు నోటిఫికేషన్, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ నియామకాలతో వైద్య రంగంలో సేవలు మెరుగుపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.