TG EAPCET 2025 Exam Dates: ఈఏపీసెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. కారణం ఇదే! పరీక్ష ఎప్పుడంటే..

TG EAPCET 2025 Exam Dates: ఈఏపీసెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. కారణం ఇదే! పరీక్ష ఎప్పుడంటే..


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఈఏపీసెట్‌ 2025కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్‌తోపాటు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగాలకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఏప్రిల్‌ 4తో ముగిసింది. దీంతో ఏప్రిల్ 4వ తేదీ నాటికి ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు 2,10,567 దరఖాస్తులు, అగ్రికల్చర్‌- ఫార్మసీ స్ట్రీమ్‌కు 81,172 దరఖాస్తులు అందాయి. రెండింటికీ కలిపి 226 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 2,91,965 దరఖాస్తులు ఈఏపీసెట్‌కు అందాయని ఎప్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి డీన్‌ కుమార్, కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె విజయ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇక రూ.250 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత రూ.5 వేలతో ఏప్రిల్‌ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వినర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

కాగా గత ఏడాది ఇంజినీరింగ్‌కు 2,54,750 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,40,617 మంది పరీక్ష రాశారు. అయితే గత ఏడాది తెలుగు రాష్ట్రాల రెండింటి విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈసారి ఏపీ విద్యార్థులకు అవకాశం లేనందున దరఖాస్తులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక గత ఏడాది అగ్రికల్చర్‌- ఫార్మసీకి 1,00,432 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు విభాగాలకు కలిపి ఆలస్య రుసుంతో వచ్చే దరఖాస్తులు మరో 10 వేలకు మించవని అధికారులు భావిస్తున్నారు.

పరీక్షల విషయానికొస్తే.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్ధులకు తప్పనిసరిగా 2025 డిసెంబరు 31 నాటికి 16 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్‌ కోర్సులకు 2025 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీలకు 25, ఇతరులకు 22 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *