
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మరిచెట్టు తండాకు చెందిన కిషన్ అనే రైతు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. నిత్యం ఉదయం పూట పంట పొలాలకు వెళ్లి పరిశీలిస్తూ ఉంటాడు. రోజు మాదిరిగానే కిషన్ ఆగస్టు 22, శుక్రవారం పొలానికి వెళ్ళాడు. పొలంలో తిరుగుతున్న సమయంలో ఏదో కదులుతూ కనిపించింది. దగ్గరకు వెళ్తున్న కొద్దీ అది వింత ఆకారంలా అనిపించడంతో ఆందోళనకు లోనయ్యాడు. దగ్గరికీ వెళ్లి పరిక్షగా చూడగా.. సముద్ర తీర ప్రాంతాల్లో కనిపించే అరుదైన నక్షత్ర తాబేలు.. కిషన్‌కు కనిపించింది. వెంటనే ఆ నక్షత్ర తాబేలుని ఇంటికి తీసుకువచ్చాడు. ఈ తాబేలుపై విష్ణుమూర్తి నామాల మాదిరిగా నక్షత్రాలు ఉండడంతో దేవుడే తన పొలంలో ఈ తాబేలును వదిలాడని కిషన్ నమ్మాడు. ఈ నక్షత్ర తాబేలు విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ ఆ తాబేలు వింతగా ఉండడంతో అటవీ అధికారులకు సమాచారం అందించాడు.
దేవరకొండ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దశ్రు నాయక్ వెంకటేస్వర్లు వచ్చి పరిశీలించి నక్షత్ర తాబేలు స్వాధీనం చేసుకున్నాడు. ఈ తాబేలును హైదరాబాదులోని జూ పార్కుకు తరలిస్తామని ఆయన చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన నక్షత్ర తాబేలు ఈ ప్రాంతంలో కనిపించడం వింతగానే ఉందని ఆయన చెప్పారు. ఈ అరుదైన నక్షత్ర తాబేలు చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.
నక్షత్ర తాబేలు మొక్కలు, పండ్లు, పచ్చి ఆహారాలను తినే శాకాహారి జీవి. కానీ, కొన్ని సందర్భాలలో చిన్న పురుగులను కూడా తింటాయి.ఈ తాబేలు సుమారు 12 నుంచి 18 అంగుళాలు పొడవుగా ఉంటుంది. ఇవి సాధారణంగా 60-100 సంవత్సరాల వరకు జీవిస్తాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి