తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో కొన్నింటిని ఇప్పటికే అమలుచేస్తోంది. అయితే వీటిలో కొన్నింటికి రేషన్‌కార్డు ప్రమాణికంగా లబ్ధిదారులను గుర్తిస్తోంది. ఇందులో ముఖ్యంగా గృహజ్యోతి, మహాలక్ష్మి ఫ్రీగ్యాస్ పథకాలు ఉన్నాయి. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించిన లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేస్తూ ఉచిత విద్యుత్తును అందిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షనుదారులకు రూ.500ల సప్సీడీతో సిలిండర్ అందిస్తోంది. అయితే రేషన్ కార్డులు ఉన్నవారే వీటికి అర్హులు కావడంతో.. రేషన్ కార్డులు లేని చాలా కుటుంబాలు ఈ పథకాలకు అర్హత పొందలేకపోయారు. అయితే వీరికి కూడా ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టింది.
అందులో భాగంగానే గత కొన్నేళ్లుగా రేషన్ కార్డును లేని కుటుంబాలకు ఇటీవలే ప్రభుత్వం కొత్తరేషన్ కార్డులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల లబ్ధిదారుల జాబితాలో ఈ కొత్త రేషన్ కార్డు హోల్డర్స్‌ను చేర్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ రెండు పథకాలకు కొత్త రేషన్ కార్డు హోల్డర్స్ నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పొందిన వేలాది మంది లబ్ధిదారులకు మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు వర్తింపజేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. భీంపూర్ మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో కొత్త రేషన్ కార్డు పొందిన లబ్ధిదారుల నుంచి ఉచిత విద్యుత్తు కోసం దరఖాస్తులు సేకరించారు.
కొత్త రేషన్ కార్డు దారులు ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కొత్త రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు ఆయా పథకాలకు అప్లై చేసుకునేందుకు మీ సమీపంలోని ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసుల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలను సంప్రదించాలి. పథకాలకు కావాల్సిన ధ్రువపత్రాలను తీసుకెళ్లి పథకాలకు అప్లై చేసుకోవాలి. ఉచిత విద్యుత్, కోసం నెలవారీ విద్యుత్తు బిల్లుతో పాటు ప్రజాపాలన రసీదు, కుటుంబసభ్యుల ఆధార్ కార్డు జిరాక్సులను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. రూ.500 గ్యాస్ సబ్సిడీ కోసం ప్రజాపాలన కేంద్రంలో 17 అంకెల వినియోగదారు నంబరుతో పాటు గ్యాస్ సిలిండర్ తీసుకునే టైంలో ఇచ్చిన రసీదును తీసుకెళ్లాలి. అయితే గ్యాస్ ఏజెన్సీలో మీకు ఖచ్చితంగా కేవైసీ చేసుకొని ఉండాలి.
(గమనిక: అయితే ఈ ధరఖాస్తుల స్వీకరణ కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే కొనసాగుతుందా, లేదా రాష్ట్రవ్యాప్తంగా ధరఖాస్తుల స్వీకరణ జరుగుతుందా అనేదానిపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది)
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.