హైదరాబాద్, ఆగస్ట్ 16: సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు మరువక ముందే మరో ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసింది. అక్రమ సరోగసీ వ్యవహారంలో మొత్తం ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు మొత్తం 8 మంది కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ శుక్రవారం (ఆగస్ట్ 15) పట్టుబడ్డారు. పేదింటి యువతులకు గేలం వేసి వారిని సరోగసీ, అండాల దానానికి ఒప్పించి, అందుకు ఖరీదు కట్టి జోరుగా దందా సాగిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో మరికొన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 8 మందిని అరెస్టు చేసి, రిమాండ్ కి తరలించారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి (45) ఏ1గా.. కుమారుడు నరేందర్ రెడ్డి (23) A2 నిందితులుగా ఉన్నారు. ఈ 8 మందిలో ఆరుగురు సరోగెంట్ తల్లుల చేత నిందితురాలు లక్ష్మ ప్రామెసరి బాండ్ రాయించుకుంది. పిల్లలను కని ఇచ్చే సరోగెంట్ తలులకు ఐదు నుంచి నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చేలా ముందే నిందితురాలు లక్ష్మి వారితో ఒప్పందం కుదుర్చుకునేది. అయితే సరోగసి తల్లిదండ్రుల నుంచి మాత్రం 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు లక్ష్మి వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
గతంలో పిల్లల విక్రయాలు సరోగసి కేసులో లక్ష్మని ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయినా తీరు మార్చుకోని లక్ష్మి మళ్లీ పాత పద్ధతిలోనే నేరాలకు పాల్పడుతుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మి ఆమె కుమారుడు, కూతురు తిరిగి అదే దందా కొనసాగిస్తున్నారు. పోలీసుల సోదాల్లో ఘటనా స్థలంలో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భాదారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు భారీగా పట్టుబడ్డాయి. అలాగే పలు ఐవిఎఫ్ సెంటర్‌లకు వెళ్లిన దంపతుల వివరాలను ఏజెంట్ల ద్వారా లక్ష్మి సేకరిస్తున్నట్లు అక్కడి ఆధారలను బట్టి తెలుస్తుంది.
లక్ష్మి ఇంట్లో హెగ్డే హాస్పిటల్ తో సహా అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవిఎఫ్, ఫర్టి కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్‌లకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐవీఎఫ్ హాస్పిటల్స్ తో లక్ష్మికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.