Success Story: పాత్రలు కడిగిన చేతులే కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాయ్.. ఓ సామాన్యుడి విజయగాథ

Success Story: పాత్రలు కడిగిన చేతులే కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాయ్.. ఓ సామాన్యుడి విజయగాథ


కర్ణాటకలోని ఉడుపి పట్టణానికి చెందిన జయరామ్ బనన్, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో, 13 ఏళ్ల వయసులో స్కూల్ పరీక్షల్లో తప్పాడు. చదువు తనకు సరిపడదని భావించి, తండ్రి జేబులో నుంచి కొన్ని చిల్లర డబ్బులు తీసుకొని 1967లో ఇంటి నుంచి బయలుదేరి రైలు ఎక్కాడు. ముంబై గమ్యంగా వెళ్లిపోయాడు. ముంబైలో దిగిన జయరామ్, ఆ నగరంలోని హడావుడిని చూసి, బ్రతకాలంటే పని, ఉండటానికి చోటు అవసరమని గుర్తించాడు. వెంటనే ఒక రెస్టారెంట్లో నెలకు కేవలం 18 రూపాయల జీతానికి పాత్రలు కడగడం, బల్లలు తుడిచే పనిలో చేరాడు. చేసే పని ఏదైనా మనసుపెట్టి చేయాలనే తత్వం గల జయరామ్, ఆరు సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. అతని కష్టాన్ని గుర్తించిన యాజమాన్యం, అతని జీతాన్ని రూ. 18 నుంచి రూ. 200కు పెంచింది.

ఆ విజయంతో ఆగిపోలేదు..
క్రమంగా, జయరామ్ వెయిటర్‌గా, ఆ తర్వాత అదే రెస్టారెంట్‌కు మేనేజర్‌గా ఎదిగాడు. తాను మేనేజర్ అయినంత మాత్రాన విజయం సాధించానని జయరామ్ ఎప్పుడూ భావించలేదు. ముంబైలో సౌత్ ఇండియన్ ఫుడ్‌కు ఉన్న క్రేజ్‌ను గమనించిన జయరామ్, సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి, 1974లో ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ క్యాంటీన్లను ఎలా నిర్వహించాలి, ఫుడ్ బిజినెస్‌ను ఎలా నడపాలి వంటి మెలకువలు నేర్చుకున్నాడు. ఈ అనుభవంతో, 1986లో ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో “సాగర్” పేరుతో తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. మొదటి రోజు అతని ఆదాయం 408 రూపాయలు. నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ ఫుడ్‌కు చాలా క్రేజ్ ఉందని, ధర ఎక్కువైనా రుచి బాగుంటే జనం వస్తారని జయరామ్ గ్రహించాడు. కొద్ది రోజుల్లోనే “సాగర్” రెస్టారెంట్‌కు మంచి పేరు వచ్చింది.

రుచి కోసం దూరం నుంచి కూడా ప్రజలు వచ్చి తినేవారు. మంచి ఆదాయం రావడంతో, ఢిల్లీలోని లోథి మార్కెట్‌లో మరో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత “సాగర్ రత్న” పేరుతో ఢిల్లీతో పాటు నార్త్ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లను విస్తరించాడు. ప్రస్తుతం జయరామ్ దేశ, విదేశాల్లో కలిపి 90 రెస్టారెంట్లను నడుపుతున్నాడు, ఇందులో కెనడా, బ్యాంకాక్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. 2001లో “స్వాగత్” పేరుతో మరో రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించడంతో అతని దశ మరింత మారింది. అతని రెస్టారెంట్లలో దోశ, సాంబార్ కోసం ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ కట్టేవారు. జయరామ్‌కు “దోశ కింగ్ ఆఫ్ నార్త్” అనే పేరు కూడా వచ్చింది. ఒక నివేదిక ప్రకారం, జయరామ్ ఆస్తుల విలువ 300 కోట్ల రూపాయలకు పైమాటే. విజయం ఒక్క రాత్రిలో రాదు, కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుందని చెప్పడానికి జయరామ్ బనన్ ఒక గొప్ప ఉదాహరణ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *