డాగ్ అంటే డాగ్ కాదు. వాటి పర్‌ఫామెన్స్ చూస్తే ఓ మై డాగ్ అనాల్సిందే. SLBC సొరంగమార్గంలో రెస్క్యూ ఆపరేషన్‌కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ విభాగాలు, నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. ఇలాంటి విపత్తుల్లో అపార అనుభవమున్న ఎక్స్‌పర్ట్స్ రెండువారాలుగా శ్రమిస్తున్నారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ మహామహులకే అగ్నిపరీక్ష పెడుతున్న సమయంలో హెలికాప్టర్‌లో వాలిపోయింది మరో స్పెషల్ టీమ్.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిదిమంది జాడ కోసం రంగంలోకి దిగాయి రెండు కెడావర్ డాగ్స్. క్రైమ్ స్పాట్‌కి సాధారణంగా వచ్చే మామూలు పోలీస్ డాగ్స్ కావవి. స్పెషల్లీ ట్రైన్డ్ డాగ్స్. వయనాడ్ వరద విపత్తులో రెస్క్యూ బృందాలు గుర్తించలేకపోయిన మృతదేహాల ఆనవాళ్లను కూడా సునాయాసంగా పసిగట్టిన పవర్‌ఫుల్ డాగ్స్.
కెడావర్ డాగ్స్ ఇన్వెస్టిగేషన్ రూటే సెపరేటు. ప్రమాదాల సమయంలో శిథిలాల కింద.. మనుషులు బతికున్నా, నిర్జీవంగా ఉన్నా కనిపెట్టగల సామర్థ్యం వీటి సొంతం. 15 అడుగుల కింద ఉన్నా గుర్తించగల కెపాసిటీ కెడావర్ డాగ్స్‌కి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనైనా.. తేలిగ్గా వాసనను పసికట్టగలగడం ఈ కెడావర్ డాగ్స్ ప్రత్యేకత. నేరపరిశోధనలో చాలాసందర్భాల్లో వీటితో మెరుగైన ఫలితాలు సాధించాయి దర్యాప్తు బృందాలు. కేరళ వయనాడ్ విపత్తుల్లోనూ ఇవి విశేష సేవలు అందించాయి. వయనాడ్ వరదల సమయంలో బురదలో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించాయి కెడావర్ డాగ్స్.
అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే శక్తి కెడావర్ డాగ్స్‌కు ఉంది. అందుకే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కెడావర్ డాగ్స్‌తో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది కేరళ టీమ్. విపత్తుల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న అనేకమందిని ఈ డాగ్స్ గుర్తించాయి. కేరళే కాదు.. ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌లో కెడావర్ డాగ్స్ సంచలన కేసుల్ని శోధించాయి. మనుషులు, జంతువుల కుళ్లిన శరీర అవశేషాలను ఈ జాతి కుక్కలు అవలీలగా గుర్తిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కెడావర్ డాగ్స్ సేవలను వినియోగిస్తారు. సాధారణ డాగ్స్ కంటే కెడావర్ జాతి భిన్నమైంది. మనిషికి 40 రకాల వాసనలను గుర్తించే శక్తి ఉంటే, కుక్కలకు ఆ శక్తి 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్‌కు చెందిన కెడావర్ జాతి కుక్కలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. డీకంపోజ్ అయిన మానవ శరీరాల వాసనలను గుర్తించేలా వీటికి శిక్షణ ఇస్తారు. అందుకే వీటిని హ్యూమన్ రిమైన్స్ డిటెక్షన్ డాగ్స్ అని కూడా అంటారు. కుళ్ళిన, చాలా కాలం క్రితమే పూడ్చిపెట్టిన, ఎముకలు మాత్రమే మిగిలిన మానవ శరీరాలను గుర్తించేలా కెడావర్ డాగ్స్‌కి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ జాతి కుక్కల సేవలను దర్యాప్తు సంస్థలు వినియోగించుకుంటున్నా.. భారత్‌లో కేరళ పోలీసులు వీటిని వినియోగించుకోవడంలో ముందున్నారు. మృతదేహాలను గుర్తించడంలో కేరళలో మాయ, మర్ఫీ అనే రెండు కెడావర్ పోలీస్ డాగ్స్‌కి మంచి పేరుంది.
భూమిపైనే కాదు.. నీటిలో ఉన్న మృతదేహాల వాసనలను, మనుషుల అవశేషాలను కూడా పసిగట్టడం కెడావర్ డాగ్స్ స్పెషాలిటీ. శిక్షణ పొందిన శునకాలు 15 అడుగుల లోతు వరకు ఖననం చేసిన శరీరాలతో సహా కుళ్లినదేహాల వాసనని పసిగట్టటంలో 95 శాతం రిజల్ట్ సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. గల్లంతైనవారి జాడ తెలుసుకోవడంలో ఎన్నో సందర్భాల్లో కెడావార్ జాతి కుక్కలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించాయి. వాటిని ఇలాంటి సేవలకు వినియోగించుకోవడానికి ముందు సుమారు వెయ్యి గంటల స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. జంతువులు, మానవుల అవశేషాల మధ్య తేడాని సునాయాసంగా గుర్తించడం కెడావర్ డాగ్స్‌కున్న ప్రత్యేకత.
ఖననం చేసినా, ఎక్కడైనా కనిపించకుండా దాచినా, నీటి అడుగున ఉన్నా భిన్నమైన వాతావరణాల్లో, దట్టమైన పొదల్లో, చిత్తడి ప్రాంతాల్లో కూడా పనిచేసేలా కెడావర్ డాగ్స్‌కి శిక్షణ ఇస్తారు. తప్పిపోయిన వ్యక్తులను కనిపెట్టడంలో, హత్యకేసుల దర్యాప్తుల్లో, ప్రకృతి వైపరీత్యాలు, ఏవైనా ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఈ జాతిరకం కుక్కలు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. డ్రగ్స్, బాంబ్స్, వివిధ రకాల వస్తువుల నుంచి వచ్చే వాసనలను మామూలు కుక్కలు పసిగట్టగలుగుతాయి. ప్రత్యేకంగా మృతదేహాలను గుర్తించడంలో నైపుణ్యం ఉన్న కెడావర్ డ్రగ్స్ మాత్రమే మృతదేహాలను, వాటి అవశేషాలను పసిగట్టగలుగుతాయి.
ఇన్ని ప్రత్యేకతలుండబట్టే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కోసం అంత నమ్మకంగా వాటిని ఆకాశమార్గంలో తీసుకొచ్చారు. SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఘటనాస్థలంలో మూడు స్పాట్స్‌ను కెడావర్ డాగ్స్ టీమ్ గుర్తించింది. మార్కింగ్ చేసిన ఆ మూడు ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్‌లు తవ్వకాలు చేపట్టడం ఆసక్తి రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..