కొందరు నిరంతరం మనం చేసే పనులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. మన విజయాలను తక్కువ చేసి చూపుతుంటారు. మనం చేసే ప్రతి పనిలో అడ్డంకులను క్రియేట్ చేస్తుంటారు. వీరు మనకు శత్రువులే అయినా ఒకింత వీరు బెటరే. కానీ వీరు ఇంకోరకం. ఎప్పుడూ అభద్రతా భావంతో, అసూయా ద్వేషాలతో రగిలిపోతుంటారు. వారు జీవితంలో ఎదగడం కన్నా ఎదుటివారిని ఎదగనీయకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ వీరిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వీరు చాలా తెలివైన వారు కూడా. అందుకే మన పక్కనే ఉంటూ మనకు చేయాల్సిన నష్టం చేస్తుంటారు. మన విజయాలు, సంతోషాల పట్ల నోటితో నవ్వి, నొసటితో వెక్కిరిస్తుంటారు. పక్కనే ఉంటూ మన సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటారు. సమయం వచ్చినప్పుడు వాటినే మనపైకి ఆయుధాల్లా ప్రయోగిస్తుంటారు.
మనతోనే ఉంటారు..
మీపై అసూయ ఉన్నవారెవరూ ఆ విషయం బయటకు చెప్పరు. అలాగని మిమ్మల్ని వదిలి వెళ్లరు. మీ చుట్టూనే ఉంటూ మీకో శ్రేయోభిలాషిలో మెలుగుతారు. లోలోపల మిమ్మల్ని పోటీగా భావిస్తుంటారు. కానీ అది బయటకు కనపడనీయరు.
మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు..
ఇలాంటివారెప్పుడూ సొంతంగా జీవించడానికి కష్టపడుతుంటారు. మిమ్మల్ని నిరంతరం ఇమిటేట్ చేస్తుంటారు. మీలా నడవడం, మీలా మిమిక్రీ చేయడం ఏదో విధంగా మిమ్మల్ని గుర్తుచేసే హావాభావాలు పలికించడం వంటివి మీపై జలసీతో చేసేవే.
ఆ కళ్లను పసిగట్టాలి..
మీ జీవితంలో ఏదైనా సాధించినప్పుడు లేదా గొప్పగా ఏదైనా చేసినప్పుడు పైకి అభినందించినప్పటికీ లోలోల మాత్రం దాన్ని జీర్ణించుకోలేరు. అంతర్గతంగా సంఘర్షణకు లోనవుతుంటారు. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతూనే చిన్న కళ్లతో తదేకంగా మీవైపు చూస్తుంటే మీపై లోలోపల రగిలి పోతున్నారని అర్థం.
రూమర్లు పుట్టిస్తారు..
మీరు ఏదో బలహీన క్షణంలో మీకు సంబంధించిన రహస్యాలను ఎదుటివారితో పంచుకుంటారు. కొన్ని రోజులకు ఆ విషయాలు రూమర్ల రూపంలో అందరి నోట్లో నానుతుంటాయి. మీకు తెలియకుండా వీరు మీ వెనకాల చేస్తున్న పనులను కూడా గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండాలి.
అందుకే వీరితో జాగ్రత్త..
అందుకే అత్యాశ, అసూయలతో రగిలిపోయేవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. పొరపాటున కూడా అలాంటి వారి నుండి సహాయం కోరకూడదు. ఎందుకంటే ఇటువంటివారు తమలోని అసూయ కారణంగా మీకు హాని కలిగించవచ్చు. అసూయ కలిగిన వ్యక్తి ఎప్పుడూ ఎదుటివారిని అర్థం చేసుకోలేడు.. తానూ సొంతంగా ఎదగలేడని గుర్తుంచుకోవాలి.