
కుంకుమపువ్వు ఒక విలువైన ఔషధ మొక్క. దీన్ని జాఫ్రాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతుంది. చిన్న చిన్న తంతువుల్లా ఉండే ఈ కుంకుమపువ్వు శరీరానికి ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దీనిలో ఉండే పోషకాలు ఎంతో తోడ్పడతాయి.
చర్మానికి మెరుపు రావాలంటే శరీరం లోపల శుభ్రంగా ఉండాలి. జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తే రక్తంలో మలినాలు తక్కువగా ఉంటాయి. రక్తప్రసరణ బాగా జరిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కుంకుమపువ్వు నీరు ఈ రెండు అంశాలను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను చక్కబెడుతుంది. రక్త ప్రసరణను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ప్రతి రోజు శరీరంలోకి కలుషిత పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ వల్ల మలినాలు చేరతాయి. ఇవి చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తీసుకురావచ్చు. కుంకుమపువ్వు నీరు ఈ మలినాలను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. తద్వారా చర్మం సహజంగా మెరుస్తుంది. ముఖం నిగారింపుగా కనిపిస్తుంది. సహజంగా వెలిగే ముఖం కోసం ఇది ఒక మంచి సహాయక మార్గం.
చాలా మందిని బాధించే మరో పెద్ద సమస్య మొటిమలు. ఈ మొటిమల వల్ల ముఖం మీద మచ్చలు, మంటలు కనిపిస్తాయి. కుంకుమపువ్వులో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమంగా మచ్చలు మసకబారతాయి. చర్మం మృదువుగా, మెరిసేలా మారుతుంది.
కుంకుమపువ్వు నీరు తయారు చేయడం చాలా సులువు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు నుండి మూడు కుంకుమపువ్వు తంతులను వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ప్రతిరోజూ ఇలా తాగడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోయి.. శరీరం శుభ్రంగా మారుతుంది. ఇది మీ ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది. శరీరాన్ని తేలికగా ఉంచుతుంది.
కుంకుమపువ్వు నీరు తాగేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. మంచి నిద్ర కావాలి. పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకుంటే ఇది మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మూడు అంశాలు కలిస్తే ముఖం మీద తేజం స్వతహాగా కనిపిస్తుంది.
కుంకుమపువ్వు నీరు సహజమైన, హానికర రసాయనాలు లేని అందాన్ని అందించే మార్గం. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. సహజమైన అందం కోసం ఇలా చేయండి.