టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా డిజాస్టర్లతో సతమతమవుతున్న రామ్.. హిట్టు కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్.. ఆ తర్వాత నటించిన స్కంధ, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత రామ్ ఇప్పుడు ఓ ప్రేమకథలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా మాస్ హీరోగా కనిపించిన రామ్ పోతినేని… ఇప్పుడు స్లిమ్ అండ్ క్లీన్ లుక్ లో అమ్మాయిల మనసు దోచే హీరోగా కనిపించనున్నాడు. ప్రస్తుతం రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ షేర్ చేశారు మేకర్స్. రామ్ పోతినేని, పి.మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా విడుదలైన గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో రామ్ సరసన మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ఇందులో రామ్ సాగర్ పాత్రలో నటిస్తుండగా.. మహాలక్ష్మీ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే అలరించనున్నారు. ఈ సినిమాలో రామ్ లుక్స్, స్టైల్, మేనరిజం ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారురు. ఈ సినిమా కథలో ఉపేంద్ర హీరో కాగా.. ఆయనను అభిమానించే వ్యక్తిగా రామ్ ఇందులో కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్.. అభిమానుల్లో మరింత ఉత్సాహం, ఊపు నింపేలానే కనిపిస్తుంది.