సోదరుడు, సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా నిలిచే రాఖీ పండగ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ. శతాబ్దాలుగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారికి దీర్ఘాయుష్షు, ఆనందాన్ని కోరుకోవడం, సోదరులు తమ సోదరీమణులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేయడం ఒక సంప్రదాయం. రాఖీ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడికి కాకుండా మరెవరికి రాఖీ కట్టగలదో తెలుసుకుందాం.
దేవుడికి రాఖీ కట్టే సంప్రదాయం
రాఖీ కట్టే మొదటి హక్కు దేవుడిదే అని భావిస్తారు. చాలా మంది సోదరీమణులు మొదట శ్రీకృష్ణుడు, శివుడు లేదా గణేశుడికి రాఖీ కడతారు. తరువాత తమ సోదరుడికి రాఖీ కడతారు. ఇలా చేయడం అంటే దేవుడే తమకు మొదటి రక్షకుడు అనే విశ్వాసానికి నిదర్శనం.
అక్కకి చెల్లెలు రాఖీకట్టే సంప్రదాయం
ఏ యువతికి అయినా అన్నదమ్ములు లేకుంటే.. ఆమెకు అక్కాచెల్లెలు ఉన్నట్లు అయితే.. ఆమె తన అక్కకు రాఖీ కట్టవచ్చు. ఇది సోదరీమణుల అనుబంధం, ప్రేమ, ఐక్యతకు చిహ్నం.
ఇవి కూడా చదవండి
గురువుకు రాఖీ
భారతీయ సంస్కృతిలో గురువును దేవునితో సమానంగా భావిస్తారు. ఒక శిష్యుడు తన గురువుకు రాఖీ కట్టడం అంటే.. అతను గురువును రక్షించి, సేవ చేసి, గౌరవిస్తానని వాగ్దానం చేస్తున్నట్లు అర్థం.
పూజారులు, సాధువులు, ఋషులకు రాఖీ
చాలా ప్రదేశాలలో మహిళలు సాధువులు, ఋషులు లేదా ఆలయ పూజారులకు రాఖీ కడతారు. ఇది మత విశ్వాసం, ఆధ్యాత్మిక సంబంధానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ సంప్రదాయం ముఖ్యంగా బృందావనం, మధుర, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో కనిపిస్తుంది.
సైనికులకు రక్షణ దారంగా రాఖీ
రాఖీ సందర్భంగా సోదరీమణులు భారత సైన్యం, పోలీసు, పారామిలిటరీ దళాల సైనికులకు రాఖీని పంపుతారు లేదా వారే వెళ్లి స్వయంగా రాఖీని కడతారు. ఇది సమాజాన్ని రక్షించే రక్షకుడి పట్ల గౌరవం, విశ్వాసానికి చిహ్నం.
చెట్లకు రాఖీ కట్టడం
పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని పెంపొందించడానికి చాలా మంది చెట్లకు రాఖీ కడతారు. చెట్లను కాపాడుతామని, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుతామని ఇది ప్రతిజ్ఞ చేయడం.
రాఖీ పండగ 2025 ఎప్పుడు?
పంచాంగం ప్రకారం శ్రావణ మాసం నెల పౌర్ణమి తిథి ఆగస్టు 8న తెల్లవారుజామున 2:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఆగస్టు 9న తెల్లవారుజామున 1:24 గంటలకు ముగుస్తుంది. కనుక ఉదయ తిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 9, 2025న జరుపుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.