ఓటీటీలో అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటాయి. హారర్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్.. ఇలా అన్ని జానర్ల సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అలాగే డాక్యుమెంటరీలు కూడా రూపొందుతున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక నర రూప హంతుకుడికి సంబంధించిన క్రైమ్ డాక్యుమెంటరీనే. బెంగళూరులో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కంది. ఇది మిమ్మల్ని భయపెడుతుంది. ఆలోచింపజేస్తుంది. ఉత్కంఠకు గురి చేస్తుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అన్న ఆలోచనను రేకెత్తిస్తుంది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత. అందుకే ప్రజలు కూడా మొదటగా పోలీసులను నమ్ముతారు. కానీ కొన్నిసార్లు ఇదే పోలీసులు సమాజానికి ప్రమాదకరంగా మారవచ్చు. ఇదే ఈ క్రైమ్ డాక్యుమెంటరీ చూపిస్తుంది. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడినఈ సిరీస్ ఒక పోలీస్ లోని మానవ మృగాన్ని బహిర్గతం చేస్తుంది.
మనం మాట్లాడుకుంటున్న క్రైమ్ డాక్యుమెంటరీ పేరు ‘ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూరు’. ఇది ఉమేష్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ కథ. పగటిపూట అతను తన పోలీస్ యూనిఫాంలో సమాజాన్ని కాపాడుతున్నట్లు నటిస్తాడు. కానీ రాత్రిపూట, అదే యూనిఫాం ధరించి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడతాడు. బెంగళూరులో సంచలనం రేపిన కానిస్టేబుల్ ఉమేష్ రెడ్డి ఉదంతం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. అతనొక సీరియల్ కిల్లర్, రేపిస్ట్, హంతకుడు. పగలంతా పోలీసుగా విధులు నిర్వర్తించే అతను రాత్రి సమయాల్లో ఒంటరిగా నివసించే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి ఇళ్లలోకి ప్రవేశించి, అత్యాచారం చేసి, ఆపై వారిని చంపేసేవాడు.
ఉమేష్ రెడ్డి క్రూర మనస్తత్వాన్ని ‘ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూరు’ డాక్యుమెంటరీలో చక్కగా చూపించారు మేకర్స్. ఇందులో పోలీసులు, జర్నలిస్టులు, కేసులో భాగమైన ఇతరులతో నిజమైన ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ నరరూహ హంతకుడు 18 మంది మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వీటిలో తొమ్మిది కేసుల్లో అతను దోషిగా తేలాడు. 2002లో అతన్ని అరెస్టు చేసి మొదట మరణశిక్ష విధించారు. అయితే, ఈ శిక్షను తరువాత జీవిత ఖైదుగా మార్చారు. నేర తీవ్రత ఎక్కువగా ఉండే డాక్యుమెంటరీ కావడంతో దీనిని పిల్లలతో చూడకపోవడమే ఉత్తమం.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..