Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో భారత్‌దే పూర్తి పైచేయి అని కేంద్రం చెబుతుంటే .. రాహుల్‌గాంధీ మాత్రం ప్రధాని మోదీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ట్రంప్ ఫోన్‌కాల్‌కు భయపడి పాకిస్తాన్‌తో మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని అన్నారు. రాహుల్ పాక్ ఐఎస్‌ఐ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి కాల్పుల విరమణపై వివరణ ఇవ్వాలని ఇండి కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ఆపరేషన్ సింధూర్‌పై పొలిటిక్ వార్ మరింత ముదిరింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. CDS అనిల్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దంలో నష్టం ముఖ్యం కాదని , ఫలితాలే ముఖ్యమన్నారు. భారత్‌పై 48 గంటల్లో విజయం సాధిస్తామని పాకిస్తాన్ పగటి కలలు కన్నట్టు చెప్పారు. కాని 8 గంటల్లోనే భారత్‌కు లొంగిపోయేలా మన సైన్యం గట్టి బుద్ది చెప్పిందన్నారు. కాల్పుల విరమణకు పాకిస్తానే ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. పాక్ అణ్వాయుధాలను చూసి భారత్ భయపడడం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని అన్నారు. ఉగ్రదాడులకు వెంటనే సమాధానం ఉంటుందన్న విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలన్నారు.
భోపాల్ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని ఆరోపించారు. నరేందర్ .. సరెండర్ అనగానే మోదీ భయపడ్డారని అన్నారు. ట్రంప్ బెదిరింపులతో మోదీ పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని అన్నారు. 1971 యుద్దంలో ఇందిరాగాంధీ ఎవరికి భయపడలేదని అన్నారు. స్వాతంత్ర్య కాలం నాటి నుంచి సరెండర్ కావడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు అలవాటే అని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్.
అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ISIకి ప్రతినిధిలా రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించింది. ఆపరేషన్ సింధూర్‌పై కావాలనే దేశప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించింది. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాల విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలన్న విషయంపై రెండు గంటల పాటు ప్రధాని మోదీతో చర్చించారు.
మరోవైపు ఢిల్లీలో జరిగిన ఇండి కూటమి పార్టీల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని నిర్ణయించారు. దీని కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 16 పార్టీలు ఎంపీలు ఈ లేఖపై సంతకాలు చేశారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణపై వెంటనే కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు ప్రజల గొంతుక అని అన్నారు శివసేన ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. ట్రంప్ కోరితే వెంటనే కాల్పుల విరమణ ప్రకటించారని , విపక్షం కోరితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించారు.
కాంగ్రెస్, ఆర్జేడీ ఎంపీలు కూడా ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో 200 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇండి కూటమి ఎంపీల సమావేశానికి హాజరుకాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ప్రత్యేకంగా ప్రధానికి వేరే లేఖ పంపుతోంది. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ఎటువంటి డిమాండ్ రాలేదు.
పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్‌పై సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ చెప్పినదానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగిందని వివరణ ఇచ్చింది. అందరు అనుకున్నట్టు భారత్ కేవలం 9 ప్రాంతాల్లో మాత్రమే కాదు.. 17 ప్రాంతాల్లో దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వమే ఒప్పుకుంది. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌ను భారత్ కోలుకోలేని దెబ్బ తీసింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధర.. భారీగా పెరుగుతున్న పసిడి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి