కోటా, ఫిబ్రవరి 26: రాజస్థాన్‌లోని కోటాలో యేటా పెరిగిపోతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కోటా కేర్స్ క్యాంపెయిన్ కింద కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లకు జిల్లా యంత్రాంగం మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోటాకు వచ్చే విద్యార్థుల జీవన వ్యయం తగ్గించడం, ఆత్మహత్యలను నిర్మూలించడమే లక్ష్యంగా వీటిని తీసుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కోటా నగరంలో మొత్తం 4 వేలకు పైగా హాస్టల్లో ఏడాది మొత్తం హాస్టల్ ఫీజును యాజమాన్యం వసూలు చేసేవి. ప్రస్తుతం ఆ ఫీజును రూ.2 వేల వరకు మాత్రమే వసూలు చేసేలా నిబంధనలు విధించింది.
అంతేకాకుండా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడే వీలు లేకుండా హాస్టళ్లలో యాంటీ సూసైడ్ సీలింగ్ ఫ్యాన్లు అమర్చాలని పేర్కొంది. ఇవి స్ర్పింగ్ తరహా సీలింగ్ ఫ్యాన్ల మాదిరి ఉంటాయి. దీంతో పాటు హాస్టల్ గేట్ మెన్‌లకు అప్రమత్తంగా ఉండేలా శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులకు వన్-టైమ్ పాస్ ప్రాతిపదికన చంబల్ రివర్ ఫ్రంట్, ఆక్సిజన్ జోన్ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం కల్పించాలి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌లో కోటా కేర్స్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడం, హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. హాస్టల్ సిబ్బంది రాత్రిపూట మాన్యువల్ హాజరు తీసుకోవాల్సి ఉంటుంది. వసతి గృహంలో వినోద ప్రదేశాలు ఉంటాయి. హాస్టల్ నిర్వహకులు విద్యార్ధుల తల్లిదండ్రులకు అన్ని చెల్లింపులకు రసీదులు అందించాలి. కోటాలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి. తద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలలోని విద్యార్థులకు మెరుగైన వసతి, సంరక్షణ సౌకర్యాలను అందించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు.
2024-25లో పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం కోటకు వచ్చే విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుంచి 1.24 లక్షలకు పైగా గణనీయంగా తగ్గిందనీ, దీని వలన దాదాపు 50 శాతం ఆదాయ తగ్గిందనీ, పలు హాస్టళ్లు 40 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీతో ఉన్నాయని అన్నారు. హాస్టల్ అసోసియేషన్ నుండి విశ్వనాథ్ శర్మ, సునీల్ అగర్వాల్, నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, హాస్టల్‌లు, పీజీలు ఇప్పుడు విద్యార్థుల సంరక్షణ కోసం కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తాయన్నారు. జిల్లా పరిపాలన, కోచింగ్ సంస్థలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.