పాపులారిటీ కోసం, టీవీలు, పేపర్‌లలో పేరు తెచ్చుకోవడం కోసం అవార్డ్ ఫంక్షన్‌లు చేయడం, వాటికి పెద్ద సెలబ్రిటీలను ఆహ్వానించడం, అందుకోసం వారికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించడం గురించి మనం వినే ఉంటాం. కానీ, ఇక్కడ అవార్డు షో పేరుతో నటుడిని కిడ్నాప్ చేశారు. ఇందుకోసం నటుడికి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చి రప్పించారు. ‘వెల్ కమ్ ’, ‘స్త్రీ 2’ చిత్రాల్లో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్‌కు గురయ్యారు. ఢిల్లీ-మీరట్ హైవేపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అపహరించి తీసుకెళ్లిపోయారు. సుమారు 12 గంటల పాటు కిడ్నాపర్ల చెరలో చిత్రహింసలకు గురయ్యాడు. అయితే చివరికీ ఎలాగోలా కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్న ముస్తాక్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మీరట్‌లో అవార్డ్ ప్రోగ్రాం నిర్వహించామని, దానికి మీరు రావాలని ముస్తాక్‌కి ఆహ్వానం అందింది. ఇందుకోసం నటుడికి నమ్మకం కలిగించడానికి ఫ్లైట్ టిక్కెట్లు కూడా బుక్ చేశారు.అలాగే అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాడు. ఇంత చేసినప్పుడు ఎవరు మాత్రం అనుమానించగలరు? అందుకే ముస్తాక్ హ్యాపీగా అవార్డు వేడుకకు వెళ్లాడు. ముస్తాక్ ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఆయనను తీసుకెళ్లేందుకు ఓ కారు కూడా వచ్చింది. కానీఅది మీరట్ కు వెళ్లలేదు. బదులుగా అది బిజ్నోర్ సమీపంలోకి వెళ్లింది. అక్కడ ముస్తాక్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.
కిడ్నాపర్లు ముస్తాక్ నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయనకు కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పండి. అందుకే చివరకు అతని కుమారుడి ఖాతాల నుంచి రూ.2 లక్షలు మాత్రమే తీసుకున్నారు. ముస్తాక్ కిడ్నాప్ అనేది సినిమా కథ అయితే, అతను తప్పించుకోవడమనేది మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది కూడా సినిమా కథ కంటే తక్కువేమీ కాదు. ఉదయం ప్రార్థనల కోసమని మసీదుకు వెళ్లాడు ముస్తాక్. అక్కడ అందరూ ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా తప్పించకున్నాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసుల సాయంతో ఇంటికి చేరుకున్నాడు. మరికొద్ది రోజుల్లో ఆయన మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.