వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురువు, లాభ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేయడం గొప్ప అదృష్టంగా భావించాలి. ఈ రెండు గ్రహాల కారణంగా వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఈ ఏడాది వీరికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో రాజ యోగాలు కలుగుతాయి. ఉన్నత పదవులను అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మిథునం: ఈ రాశిలో గురువు, దశమంలో శని సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, ఉద్యోగంలో స్థిరత్వం సంపాదించడానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభపడతారు.
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల అష్టమ శని దోషం చాలావరకు తగ్గిపోవడంతో పాటు శని శుభుడుగా మారడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టినా అంచనాలకు మించిన ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు.
కన్య: ఈ రాశికి సప్తమంలో శని, ఆరవ స్థానంలో రాహువు, దశమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో శని, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల లక్ష్మీకటాక్షం కలుగు తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పడుతుంది. వ్యాపారాలు లాభాలను పండిస్తాయి. శుభ వార్తలు ఎక్కువగావింటారు.
మకరం: తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడు, షష్ట స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండకపోవచ్చు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభించి మనశ్శాంతి పొందుతారు. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. పిత్రార్జితం పొందే అవకాశం ఉంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు బాగా లాభిస్తాయి.