మద్యం కుంభకోణం ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో ఈడీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం కొడుకును అరెస్ట్ చేయడం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 2వేల 100 కోట్ల లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అతడిని అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును లిక్కర్ సిండికేట్ అడ్డదారిలో దోచేసిందంటూ ఇప్పటికే కొన్ని ఆధారాల్ని సేకరించారు. ఈ అరెస్ట్‌కు కొన్ని గంటల ముందు కూడా దుర్గ్ జిల్లాలోని భిలాయ్‌లో ఉన్న భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది.
చైతన్యను రాయ్‌పూర్ కోర్టులో హాజరుపర్చి వారం రోజుల కస్టడీకి కోరగా… ఐదు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. ఈ అరెస్టును ఖండించారు భూపేష్ భగేల్. అసెంబ్లీ సమావేశాల చివరిరోజు కీలక అంశాలపై తాము గళమెత్తాలనుకున్నామని, ఈలోపే ఇంటికి EDని పంపారని విమర్శించారు. చైతన్య భగేల్ అరెస్ట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది.
ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చైతన్య భగేల్ పాత్ర ఉందనే అభియోగాలు వచ్చాయి. స్కాంపై కేసు నమోదు చేసిన ఈడీ.. మద్యం సిండికేట్‌కు రూ.రెండు వేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని పేర్కొంది. కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే, ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
చైతన్య అరెస్ట్ సమయంలో పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకొని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ అధికారుల వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పుట్టిన రోజు నాడే చైతన్యను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.