
దేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నివాసం ఏదంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం ముఖేష్ అంబానీ యాంటీలియా. కానీ అది తప్పు. యాంటిలియా కన్నా అతిపెద్ద ప్రైవేట్ నివాసం ఒకటి ఉంది. వందల ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనమే లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఈ రాజభవనం బ్రిటిష్ రాజకుటుంబం నివసించే బకింగ్‌హామ్ ప్యాలెస్ కన్నా నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను చూడాలంటే రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు.
700 ఎకరాల విస్తీర్ణం.. కళ్లు చెదిరే నిర్మాణం. అప్పట్లో 27 లక్షలు ఖర్చు చేస్తే.. 12 ఏళ్లకు నిర్మాణం పూర్తైంది. 1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. రాజభవన నిర్మాణానికి చీఫ్ ఆర్కిటెక్ట్ గా మేజర్ చార్లెస్ మాంట్ పని చేశారు. అద్భుతమైన ఈ రాజమందిరాన్ని ఇండో-సారసెనిక్ శైలిలో నిర్మించారు. ప్రపంచంలోనే ఇలాంటి కట్టడం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. గుజరాత్ వడోదరలో ఉంది ఈ లక్ష్మీ విలాస్ రాయల్ ప్యాలెస్. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రాజసౌధం అతిపెద్ద ప్రైవేట్ ప్యాలెస్‌గా గుర్తింపు పొందింది.
18వ శతాబ్దం నుంచి 1947 వరకు బరోడా సంస్థానాన్ని గైక్వాడ్ రాజవంశం పాలించేది. 1890లో అప్పటి మహారాజా షాయాజీరావ్ గైక్వాడ్ 3 ఈ ప్యాలెస్ నిర్మించారు. ఆ సమయంలోనే ఈ రాజభవన నిర్మాణం కోసం 27 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. 700 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జూరియస్ ప్యాలెస్‌లో మొజాయిక్ ఫ్లోర్లు, విలువైన కళాఖండాలు అబ్బురపరుస్తాయి. భవనం లోపలి భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్‌ను తలపిస్తుంది. గైక్వాడ్ల వారసత్వం, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది.
లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లోని దర్బారు హాల్ వైశాల్యం 5వేల చదరపు అడుగులు. అలాగే ఇందులో చూపరులను కట్టిపడేసే దర్బార్ హాల్స్, మోతీ భాగ్ ప్యాలెస్, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం తదితర భవనాలు కూడా ఉన్నాయి. భవనాన్ని నిర్మించేటప్పుడే అన్ని సౌకర్యాలుండేలా చూసుకున్నారు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో అప్పట్లోనే ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. అలాగే భవనం లోపల చూపు తిప్పుకోకుండా ఉండేలా యూరోపియన్ శైలిలో ఉండే ఎన్నో రకాల కళాకృతులను ఏర్పాటు చేశారు. 1930లో అప్పటి మహారాజు ప్రతాప్ సింగ్ యూరోపియన్ అతిథుల కోసం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఎదురుగా గోల్ఫ్ కోర్స్ నిర్మించాడు.
ప్రపంచంలోని ఇతర ప్యాలెస్‌లతో పోలిస్తే లక్ష్మీ విలాస్ ఎంతో స్పెషల్. బంగారు వర్ణంలో మెరిసిపోయే ప్యాలెస్ వెలుపలి భాగాన్ని సొంగాధ్ క్వారీలో లభించే విలువైన రాళ్లతో రూపొందించారు. ఇక ప్యాలెస్ లోపల 170 గదులున్నాయి. మార్బుల్ ఫ్లోర్స్, మొజాయిక్ ఫ్లోర్స్, ఎన్నో అమూల్యమైన పెయింటింగ్స్ తో పాటు రెండు కోర్ట్ యార్డ్స్, వాటర్ ఫౌంటెన్ లతో కూడిన విశాలమైన తోట ఉంది. ఈ ప్యాలెస్‌ను ఎటువైపు నుంచి చూసినా గాజు కిటికీలు కనిపిస్తాయి. వాటిని బెల్జియం నుంచి తీసుకువచ్చారు. అంతేకాదు పాతకాలం నాటి ఆయుధాలు, శిల్పాలతో ప్యాలెస్ అణువణువూ రాచరికపు శోభ కనిపిస్తుంది. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3కోట్ల 4లక్షల 92వేల చదరపు అడుగులు. బ్రిటిష్ రాజవంశీకులు నివాసముండే బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8లక్షల 28వేల 821 చదరపు అడుగులు మాత్రమే. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48వేల780 చదరపు అడుగులే. ఈ లెక్కన చూస్తే లక్ష్మీ ప్యాలెస్ ముందు ఈ రెండు బిల్డింగులు జుజూబీ అన్న మాట. ప్రస్తుతం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ మార్కెట్ వాల్యూ దాదాపు రూ. 24వేల కోట్ల పైమాటే.
లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో మెయిన్ అట్రాక్షన్ మహారాజా ఫతే సింగ్ మ్యూజియం. ఇందులో అత్యంత అరుదైన రాజా రవివర్మ పెయింటింగ్స్ ఎన్నో కనిపిస్తాయి. అంతే కాదు 1951 నుండి 1988 వరకు అప్పటి బరోడా మహారాజా ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ రాచరికపు గుర్తులైన బంగారు, వెండి ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక చిన్న రైల్వే లైను కూడా ఉంది. వాస్తవానికి ఈ భవనాన్ని రాజ కుటుంబానికి చెందిన పిల్లల పాఠశాల భవనం కోసం నిర్మించారు. అప్పట్లో స్కూల్ నుంచి ప్యాలెస్‌కు పిల్లలు సులభంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ ప్యాలెస్‌లో లిఫ్టులు ఏర్పాటు చేశారంటే ఎంత మోడ్రన్ టెక్నాలజీ వాడారో అర్థం చేసుకోవచ్చు.
2012లో ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ మరణానంతరం ఆయన మనవడు సమర్జిత్సింగ్ గైక్వాడ్‌కు పట్టాభిషేకం చేశారు. ఈయన మాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్. మోతీ బాగ్ స్టేడియంలో ఓ క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. 2002లో సమర్జిత్ సిన్హ్.. వంకనేర్ రాజ కుటుంబానికి చెందిన మాజీ జర్నలిస్టు రాధిక రాజేని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌లో ఆ కుటుంబమే నివాసం ఉంటోంది. ఈ ప్యాలెస్‌లో పలు బాలీవుడ్ సినిమాల షూటింగ్ కూడా జరిగింది. వడోదరా రైల్వే స్టేషన్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్యాలెస్ ను 150 రూపాయలు చెల్లించి ఎవరైనా సందర్శించవచ్చు. 60 రూపాయలు అదనంగా చెల్లించి మ్యూజియంను కూడా చూడొచ్చు.