కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని సోషల్ మీడియా ఎక్స్ వేదిక ద్వారా మరోసారి వ్యక్తపరిచారు.. మాటిచ్చారు.. అంటూ తాజాగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మీరు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు.. ఇచ్చినప్పుడు ఇవ్వండి.. మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఇస్తామన్నమాట ఆలస్యమైంది.. సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు.. ఎందుకు సమీకరణలు కుదరటం లేదు..? ఎవరు అడ్డుకుంటారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా..? మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని..’’ అంటూ ప్రశ్నించారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే అని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలని మండిపడ్డారు.
ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండగా, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతా అని, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టేనని ఆయన చెప్పారు. భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ తన కోసం కాదనీ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..