Ketu Transit: జ్యోతిష శాస్త్రం ప్రకారం కేతువు ఒక పాప గ్రహం. దీనికి వక్ర గ్రహమనీ, ఛాయా గ్రహమనీ కూడా పేర్లున్నాయి. సాధారణంగా ఈ గ్రహం ఎవరికీ మేలు చేయదు. ప్రస్తుతం కన్యా రాశిలో మే 18 వరకూ సంచారం చేసి ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మే 18 వరకూ కేతువు కన్యారాశిలోనే శుభ ఫలితాలను ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఈ కేతువును మూడు శుభ గ్రహాలు – గురు, శుక్ర, బుధులు – వీక్షించడం వల్ల ఈ గ్రహం తీరులో ఈ నెల 28 నుంచి సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతోంది. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారి మనసుల్లోని కోరికలు, ఆశలు చాలావరకు తీర్చే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం వల్ల కేతువు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు సృష్టించడం జరుగుతుంది. అయితే, ఈ చివరి రెండు నెలల కాలంలో శుభ గ్రహాల వీక్షణ కారణంగా ఇది తాను సృష్టించిన సమస్యలను తానే పరిష్కరించడం ప్రారంభం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండడంతో పాటు రావలసిన డబ్బు చేతికి వస్తుంది. పదోన్నతులకు ఆటంకాలు, అవరోధాలు, పోటీలు తొలగిపోతాయి. ఏ రంగంలోని వారికైనా ఊహించని పురోగతి ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతుంటాయి. కేతువులో ఈ నెల 28 నుంచి వచ్చే మార్పు వల్ల ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్న తులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశిలో ఉన్న కేతువు వల్ల తరచూ ఆరోగ్య భంగం జరుగుతుంటుంది. రాజపూజ్యాల స్థానంలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గుతాయి. జీవితానికి గ్రహణం పట్టినట్టుగా ఉంటుంది. ఈ గ్రహం మీద శుభ గ్రహాల వీక్షణ పడడం వల్ల జీవితంలో ఊహించని పురోగతి లభిస్తుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సంపన్న వ్యాపారులు, ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఎంత కష్టపడ్డా గుర్తింపు లభించక పోవడం, ప్రతిఫలం కూడా ఉండకపోవడం వంటివి జరుగుతాయి. ఫిబ్రవరి 28 తర్వాత నుంచి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు.
- ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న కేతువు వల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలుంటాయి. ఉద్యోగంలో పురోగతికి ఆటంకాలు ఎదురవుతాయి. పోటీదార్లు ఎక్కువగా ఉంటారు. ఆదాయ వృద్ది అంతంత మాత్రంగా ఉంటుంది. కేతువు శుభుడుగా మారడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. పోటీదార్లు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. ఆదా యం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో కేతు సంచారం వల్ల ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక పట్టాన పరి ష్కారం కాకపోవచ్చు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయపరమైన సమస్యలుంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. కేతువు ఇక శుభుడుగా మారుతున్నందువల్ల ఈ రకమైన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.