హైదరాబాద్, జూన్ 4: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా 2025) కౌన్సెలింగ్ మంగళవారం (జూన్ 3) సాయంత్రం నుంచి ప్రారంభమైంది. జూన్ 12 కౌన్సెలింగ్ తొలి విడత కౌన్సెలింగ్ జరగనుంది. మొత్తం 6 విడతల్లో ఈ కౌన్సెలింగ్ జరగనుంది. అన్ని ఐఐటీలు ఓపెన్‌హౌజ్‌లను నిర్వహిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో విద్యార్థులు స్వయంగా సందర్శించి ఏ IITల్లో చేరాలో నిర్ణయించుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం సర్వత్రా ఐఐటీ క్రేజ్ బాగానే ఊపందుకుంది. కొత్త ఐఐటీలు ఏర్పాటుకావడంతో సీట్లు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో చాలా మంది ఐఐటీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐఐటీ బాంబే, ఖరగ్‌పూర్ మద్రాస్ వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఓపెన్‌హౌజ్‌ను నిర్వహిస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో జూన్ 3,4 తేదీల్లో ఓపెన్‌హౌజ్ నిర్వహిస్తుంది. బుధవారం ఆఫ్‌లైన్, గురువారం ఆన్‌లైన్‌లో ఓపెన్‌హౌజ్ నిర్వహిస్తుంది.
మరోవైపు ఈసారి కొత్తగా మరో 7 సాంకేతిక విద్యాసంస్థలు (GFTI) జోసా కౌన్సెలింగ్‌లో చేరాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, జీఎఫ్‌టీఐలు కలిపి 121 విద్యాసంస్థలు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 128కి చేరినట్లైంది. మొత్తం 127 విద్యా సంస్థల్లో ఏకంగా 62,853 సీట్లను జోసా ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే కొత్తగా కౌన్సెలింగ్‌లో చేరిన జీఎఫ్‌టీఐల్లో జేఈఈ మెయిన్ ర్యాంకులతో కూడా ప్రవేశాలు పొందొచ్చు. ఒక్కోదాంట్లో 20 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా చేరిన విద్యాసంస్థలు ఇవే..
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ – అజ్మేర్ (రాజస్థాన్)
- గోరఖ్‌పుర్ (ఉత్తర్‌ప్రదేశ్)
- పాట్నా (బీహార్)
- రోపర్ (పంజాబ్)
- రాజీవ్‌గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (ఉత్తర్‌ప్రదేశ్)
- ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (జమ్మూ-కశ్మీర్)
- శ్రీ జీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మధ్యప్రదేశ్)
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.