India-Turkey Relations: భారత్-టర్కీ సంబంధాలు.. దశాబ్దాల చరిత్ర, కొత్త ఉద్రిక్తతలు.. ఎందుకిలా..?

India-Turkey Relations: భారత్-టర్కీ సంబంధాలు.. దశాబ్దాల చరిత్ర, కొత్త ఉద్రిక్తతలు.. ఎందుకిలా..?


భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ శత్రుదేశం పాకిస్తాన్‌కు శక్తివంతమైన డ్రోన్లను అందజేసిన టర్కీ (తుర్కియే)పై భారతీయులందరికీ ఆగ్రహం పెల్లుబుకింది. కోవిడ్-19 సమయంలో వ్యాక్సిన్లు అందజేసినా.. భారీ భూకంపం అతలాకుతలం చేసినప్పుడు అడగకుండానే సహాయం అందజేసినా.. ఏమాత్రం విశ్వాసం చూపని ఆ దేశంపై భారత సమాజం తీవ్రస్థాయిలో మండిపడింది. టర్కీ(తుర్కియే) వ్యవహారశైలి గురించి భారతీయుల్లో చాలా మందికి ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కానీ భారత ప్రభుత్వానికి, పాలకులకు ఆ దేశం దుష్ట వైఖరి గురించి ముందు నుంచే తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి “నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్” (NATO)లో సభ్యదేశమైన టర్కీ (తుర్కియే)తో భారత్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. దశాబ్దాలుగా టర్కీ పాకిస్తాన్‌తో బలమైన సంబంధాలు కలిగిన ఆ దేశం.. కాశ్మీర్ సమస్యపై భారతదేశాన్ని ఇరకాటంలో పడేసే ప్రయత్నమే మొదటి నుంచి చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు భారతదేశం గట్టిగా ప్రతిస్పందిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-టర్కీ సంబంధాల చరిత్రను, ఇటీవలి పరిణామాలను కాస్త లోతుగా విశ్లేషిద్దాం.

చారిత్రాత్మక నేపథ్యం: సద్భావన నుంచి విభేదాల వరకు

పశ్చిమ ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాలలో టర్కీ ఒకటి. ఇది NATO సభ్యదేశం మాత్రమే కాదు.. $1 ట్రిలియన్ డాలర్లకు పైగా GDPతో ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే భారత్ మరియు టర్కీ మధ్య సంబంధాలు మొదటి నుంచీ సంక్లిష్టంగానే ఉన్నాయి. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ఓడిపోయిన ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోయే ప్రమాదంలో పడింది. ఒట్టోమన్ కాలిఫ్ స్థానం ప్రమాదంలో పడింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆధ్యాత్మిక నాయకత్వంగా భావించారు. భారతదేశంలోని ముస్లిం నాయకులు, నాటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) మద్దతుతో కాలిఫ్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం విఫలమైనప్పటికీ, టర్కీలో భారతదేశం పట్ల సద్భావన ఏర్పడేలా చేసింది.

అయితే 1947లో భారత్-పాకిస్తాన్ విభజన తర్వాత ఈ సద్భావన పాకిస్తాన్‌కు బదిలీ అయింది తప్ప భారతదేశానికి కాదు. రెండు దేశాల మధ్య రెండు ప్రధాన సమస్యలపై విభేదాలు ఏర్పడ్డాయి: అందులో మొదటిది కోల్డ్ వార్ కాగా.. రెండోది కాశ్మీర్ సమస్య.

కోల్డ్ వార్ – వ్యూహాత్మక విభేదాలు

కోల్డ్ వార్ సమయంలో నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అటు అమెరికా, ఇటు సోవియట్ యూనియన్‌లలో ఏదో ఒక పక్షాన చేరకుండా అలీన విధానాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే టర్కీ NATOలో చేరి, సోవియట్‌లకు వ్యతిరేకంగా అమెరికా మిత్రదేశంగా మారింది. 1955లో మధ్యప్రాచ్యంలో కమ్యూనిజాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాటైన బాగ్దాద్ ఒడంబడికలో టర్కీ, పాకిస్తాన్ రెండూ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇది భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసింది. 1954లో టర్కీ పాకిస్తాన్‌తో ఒక ముఖ్యమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్‌తో టర్కీ మరింత సన్నిహితంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. భారతదేశం ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించినట్టుగా ముందుకు సాగలేదు.

కాశ్మీర్ సమస్య: సంబంధాలలో మరో అడ్డంకి

పాకిస్తాన్‌తో టర్కీ సన్నిహితంగా మారడంతో, కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. 1965, 1971 భారత్-పాక్ యుద్ధాలలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది. దీనికి ప్రతిగా, భారతదేశం టర్కీతో సరిహద్దు వివాదం కలిగిన సైప్రస్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. 1986లో కోల్డ్ వార్ ముగియడంతో పరిస్థితులు కొంత మారాయి. టర్కీ మధ్యవర్తి ప్రధాని తుర్గుత్ ఓజల్ భారతదేశాన్ని సందర్శించి, సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించారు. ఓజల్ నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ కాశ్మీర్, సైప్రస్ సమస్యలపై ఉద్రిక్తతలను నివారించడానికి అంగీకరించారు. దీంతో రెండు దేశాలు ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి.

సంబంధాలలో హెచ్చుతగ్గులు

1991లో టర్కీ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) వేదికపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, సంబంధాలు కొంత మెరుగుపడ్డాయి. 2000లో టర్కీ ప్రధాని బులెంట్ ఎసెవిట్ భారతదేశాన్ని సందర్శించారు. టర్కీ విశ్లేషకుడు సెల్కుక్ కోలాకోగ్లు ప్రకారం, ఎసెవిట్ “ప్రో-ఇండియా” నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎసెవిట్ కాశ్మీర్ సమస్యపై తటస్థ వైఖరి తీసుకున్నారు. పాకిస్తాన్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్‌తో పెద్దగా సంబంధాలు పెట్టుకోలేదు. దీంతో భారత్-టర్కీ సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి. 2003లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి టర్కీని సందర్శించారు.

అయితే ఈ మెరుగుదల ఎక్కువ కాలం నిలవలేదు. 2003లో రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ టర్కీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత, ఆయన ప్రభుత్వం మొదట భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించింది. 2008లో ఎర్డోగాన్ భారతదేశాన్ని సందర్శించారు. కానీ 2008 తర్వాత ఎర్డోగాన్ టర్కీని పాకిస్తాన్‌తో మరింత సన్నిహితం చేశారు. టర్కీ ఇస్లామిక్ దేశాలతో సహకరించాలని ఆయన విశ్వసించారు. దీనితో టర్కీ కాశ్మీర్ సమస్యపై గట్టి వైఖరి తీసుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఈ సమస్యను లేవనెత్తింది. పాకిస్తాన్‌తో రక్షణ సంబంధాలు కూడా విస్తరించాయి. మిస్సైల్స్, సబ్‌మెరైన్స్, డ్రోన్‌లలో సహకారం పెరిగింది. 2017లో ఎర్డోగాన్ భారతదేశాన్ని సందర్శించినప్పటికీ సంబంధాలు మెరుగుపడలేదు.

ఇటీవలి ఉద్రిక్తతలు: కాశ్మీర్, ఆపరేషన్ సింధూర్

2019లో భారతదేశం కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత, టర్కీ ఐక్యరాష్ట్ర సమితిలో ఈ సమస్యను లేవనెత్తడం ద్వారా భారతదేశాన్ని కలవరపరిచింది. ఈ వ్యాఖ్యల కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టర్కీ సందర్శనను రద్దు చేసుకున్నారు. తాజాగా ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారతదేశం.. “ఆపరేషన్ సిందూర్‌” పేరుతో చేపట్టిన చర్యను టర్కీ ఖండించింది. అంతేకాక భారత సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆపరేషన్‌లలో టర్కీ తమ డ్రోన్లను పాకిస్తాన్‌కు అందజేసి, భారత్‌పై దాడులకు ఉపయోగించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో భారతదేశం టర్కీతో కొన్ని విద్యా, వ్యాపార సంబంధాలను తెంచుకుంది. టర్కీ వస్తువులను, ఆ దేశంలో పర్యాటకాన్ని బహిష్కరించాలని పిలుపులు పెరుగుతున్నాయి. అదేవిధంగా భారతదేశం టర్కీ ప్రాంతీయ ప్రత్యర్థులైన గ్రీస్, ఆర్మేనియా, సైప్రస్‌తో సంబంధాలను బలోపేతం చేసింది. ఆర్మేనియాకు రాకెట్ లాంచర్లు, వెపన్ లొకేటింగ్ రాడార్లు, ఆర్టిలరీ సిస్టమ్స్ సరఫరా చేయడం ద్వారా భారతదేశం టర్కీకి సవాలు విసిరింది. ఇది టర్కీని అసంతృప్తికి గురిచేసింది.

భవిష్యత్ దిశ: సంబంధాలు మరింత దిగజారే అవకాశం

టర్కీ కాశ్మీర్, పాకిస్తాన్‌పై తన విధానాన్ని సవరించుకోకపోతే, భారత్-టర్కీ సంబంధాలు భవిష్యత్తులో మెరుగుపడే అవకాశాలు ఏమాత్రం లేవు. ఈ ఉద్రిక్తతలు భారతదేశ భౌగోళిక రాజకీయ వ్యూహంపై ప్రభావం చూపనున్నాయి. అలాగే టర్కీ ప్రాంతీయ ప్రత్యర్థులకు సహకారం అందించడం ద్వారా భారతదేశం ఈ సవాలును ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోందని అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *