IND vs ENG Test Series: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 2025 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు అర్ష్‌దీప్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ పంజాబ్ యువ కెరటం టెస్టుల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైనట్లే.
టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన..
గత టీ20 ప్రపంచ కప్‌లో అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా, ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఆర్పీ సింగ్ రికార్డును అర్ష్‌దీప్ అధిగమించడం అతని ప్రతిభకు నిదర్శనంగా మారింది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, పరుగులు నియంత్రిస్తూ జట్టుకు అండగా నిలిచాడు. ఈ ప్రదర్శన అతన్ని “టి20 ప్రపంచకప్ హీరో”గా అభిమానుల మదిలో నిలిపింది.
టెస్ట్ జట్టులో చోటుకు కారణాలు..
భారత టెస్ట్ జట్టు కొంతకాలంగా నాణ్యమైన ఎడమచేతి వాటం పేసర్ కొరతతో ఇబ్బంది పడుతోంది. జహీర్ ఖాన్ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరిచే బౌలర్ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, అర్ష్‌దీప్ సింగ్ ఎంపిక జట్టుకు వైవిధ్యం తీసుకురాగలదని సెలెక్టర్లు భావిస్తున్నారు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం, ముఖ్యంగా ఇంగ్లాండ్ పరిస్థితులకు అనుకూలించే అతని బౌలింగ్ శైలి అర్ష్‌దీప్‌కు కలిసొచ్చే అంశాలు.
ఇవి కూడా చదవండి
అంతేకాకుండా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అర్ష్‌దీప్‌ను ఇంగ్లాండ్ పర్యటనకు సంసిద్ధంగా ఉండాలని సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అర్ష్‌దీప్ ఇప్పటికే భారత్ తరపున వన్డేలు, టి20లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 21 మ్యాచ్‌లు ఆడి 66 వికెట్లు పడగొట్టాడు. 2023లో ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కెంట్ తరపున ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులపై అతనికి మంచి అవగాహన ఉంది.
ఇంగ్లాండ్ పర్యటన వివరాలు, జట్టులో మార్పులు..
భారత జట్టు జూన్ 20, 2025 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్ మైదానాల్లో జరగనున్నాయి. ఈ పర్యటనకు భారత జట్టును మే 23 లేదా 24, 2025న ప్రకటించే అవకాశం ఉంది.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో భారత టెస్ట్ జట్టులో మార్పుల దశ నడుస్తోంది. దీంతో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సిరీస్‌కు నూతన కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ లేదా రిషబ్ పంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తే, అది భారత పేస్ బౌలింగ్ విభాగానికి మరింత బలాన్ని చేకూర్చగలదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని చేరికతో భారత బౌలింగ్ దాడి మరింత పదునెక్కడం ఖాయం.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..