ICC Rankings:సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అతను 10 ఓవర్లలో కేవలం 33 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అతను రెండు స్థానాలు మెరుగుపరుచుకుని నేరుగా నెంబర్ 1 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన కారణంగా మహరాజ్ ఇప్పుడు 687 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను పైకి రావడంతో శ్రీలంక ఆటగాడు మహేశ్ తీక్షణ ఒక స్థానం పడిపోయి రెండో స్థానానికి, భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ కూడా ఒక స్థానం కోల్పోయి మూడో స్థానంలోకి వెళ్ళారు.
ఐసీసీ తాజా జాబితాలో నాల్గవ స్థానంలో నమీబియాకు చెందిన బర్నార్డ్ స్కోల్ట్జ్, ఐదవ స్థానంలో అఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆరవ స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ శాంట్నర్, ఏడవ స్థానంలో మ్యాట్ హెన్రీ, ఎనిమిదవ స్థానంలో శ్రీలంకకు చెందిన వానిందు హసరంగ, తొమ్మిదవ స్థానంలో భారతదేశానికి చెందిన రవీంద్ర జడేజా, పదవ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టాప్-10 జాబితాలో మ్యాట్ హెన్రీ మినహా మిగతా వారందరూ స్పిన్నర్లే. మ్యాట్ హెన్రీ మాత్రమే ఈ జాబితాలో ఉన్న ఏకైక పేస్ బౌలర్.
కేశవ్ మహరాజ్ ఈ మ్యాచ్‌లో మరో గొప్ప రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికా చరిత్రలో 300 అంతర్జాతీయ వికెట్లు తీసిన మొదటి స్పిన్నర్ బౌలర్‌గా అతను నిలిచాడు. అతని ఖాతాలో ఇప్పటివరకు 59 టెస్టుల్లో 203 వికెట్లు, 49 వన్డే మ్యాచ్‌లలో 63 వికెట్లు, 39 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 38 వికెట్లు ఉన్నాయి. అతని మొత్తం వికెట్ల సంఖ్య 304కి చేరింది. అయితే, అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ల జాబితాలో అతను ఇంకా చాలా వెనుకబడి ఉన్నాడు. ఈ జాబితాలో 823 వికెట్లతో షాన్ పొలాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. పొలాక్ తన కెరీర్‌లో 421 టెస్ట్, 387 వన్డే, 15 టీ20 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..