ICC Rankings: ప్రపంచ క్రికెట్‌లో ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను నిర్ణయించే ఐసీసీ తాజాగా వన్డే ఆల్-రౌండర్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈసారి ర్యాంకింగ్స్‌లో ఆసియా క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఈ ర్యాంకింగ్స్‌లో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. టాప్-5లో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. జింబాబ్వే, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లకు చెందిన ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఎవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
టాప్-5 ఆల్-రౌండర్లు వీరే!
1. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (అఫ్ఘనిస్తాన్)
అఫ్ఘనిస్తాన్ యువ ఆల్-రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 296 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. 2025లో లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుత ప్రదర్శన చేసి, తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు.
2. మహ్మద్ నబీ (అఫ్ఘనిస్తాన్)
సీనియర్ ప్లేయర్, అఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ 292 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నారు. నబీ చాలా కాలంగా అఫ్ఘన్ జట్టుకు వెన్నెముకగా నిలిచారు. 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌పై అతను తన కెరీర్ బెస్ట్ 350 రేటింగ్ సాధించారు.
3. సికిందర్ రజా (జింబాబ్వే)
జింబాబ్వే స్టార్ ఆల్-రౌండర్ సికిందర్ రజా 290 రేటింగ్ పాయింట్‌లతో మూడో స్థానంలో ఉన్నారు. అతను తన జట్టు కోసం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. 2024లో పాకిస్తాన్‌పై అతను 299 రేటింగ్ సాధించారు.
4. మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్)
బంగ్లాదేశ్ ఆల్-రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ 249 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. 2022లో మీర్‌పూర్‌లో భారత్‌పై అతను కెరీర్ బెస్ట్ 295 రేటింగ్ సాధించారు.
5. మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ ఆల్-రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ 246 రేటింగ్ పాయింట్‌లతో ఐదో స్థానంలో ఉన్నారు. 2025లో బే ఓవల్‌లో పాకిస్తాన్‌పై అతను తన కెరీర్ బెస్ట్ రేటింగ్ నమోదు చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..