బాచుపల్లిలో నిర్మానుష్య స్థలంలో ట్రావెల్ బ్యాగ్లో మహిళ మృతదేహం బయటపడటం సంచలనం సృష్టించింది. అందుతోన్న సమాచారం మేరకు రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ప్రహరీ గోడ పక్కన ఖాళీ స్థలంలో సూట్కేస్ పడివుండటం స్థానికుల దృష్టికి వచ్చింది. దుర్గంధం రావడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూట్కేసు ఓపెన్ చేయగా, అందులో యువతి మృతదేహం బయటపడింది. ఆమె మెరూన్ రంగు చుడీదార్ ధరించి ఉంది. మృతురాలి వయస్సు సుమారు 25-30 సంవత్సరాలుగా అంచనా వేశారు.
ఘటనాస్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తాజా మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీస్తున్నారు. నేరస్థుల జాడ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..