ఆమెకి 29.. అతనికి 21.. అమ్మాయిది ఉత్తరప్రదేశ్.. అబ్బాయిది రాజస్థాన్.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. నాలుగు నెలలక్రితం పెళ్లి కూడా చేసుకున్నారు.. ఏమైందో ఏమో సడన్‌గా ఆత్మహత్య చేసుకుని ఇద్దరూ తనువుచాలించారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగిందీ ఘటన. మృతులు యూపీ యువతి ఆసియాఖాన్, రాజస్థాన్ యువకుడు పవన్‌గా పోలీసులు గుర్తించారు.
4 నెలల క్రితమే ఆసియా, పవన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ పెళ్లికి పవన్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో కొద్దిరోజులుగా విభేదాలు తలెత్తాయి. ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఆసియా, పవన్. అమ్మాయి ముస్లిం.. పేరు ఆసియాఖాన్.. యువకుడేమో హిందువు.. పేరు పవన్.. తన ప్రేయసి ముస్లిం కావడంతో తన పేరును అహ్మద్‌ఖాన్‌గా కూడా మార్చుకున్నాడు పవన్. జీవితం చిన్నది.. సంతోషంగా ఉందాం అంటూ కలిసి రీల్స్ కూడా చేసుకున్నారు. కానీ, పెళ్లి అయిన నాలుగు నెలలకే ఇద్దరూ కలిసి జీవితాన్ని ముగించారు.
డ్యూటీకి వెళ్లొచ్చేసరికి ఫ్యాన్‌కి ఉరేసుకుని కనిపించింది ఆసియా. ప్రేయసి మరణాన్ని తట్టుకోలేని పవన్.. అతను కూడా అదే ఫ్యాన్‌కి ఉరేసుకుని మరణించాడు. ఆసియాకి గతంలోనే వివాహం కాగా ఓ బాలుడు ఉన్నారు. భర్తతో విడిపోయి.. పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో వీళ్లిద్దరినీ దూరం పెట్టాయి ఇరు కుటుంబాలు. దాంతో, బంధువులు ఎవరూ చూడ్డానికి కూడా రాలేదు. ఆసియా, పవన్ ఆత్మహత్యపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాంతో, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.