హైదరాబాద్ నగరంలో మరో భారీ మోసం బయటపడింది. వెంచర్లు, ఫ్లాట్‌లు, రిసార్ట్స్, మెట్రో స్టేషన్‌లో రెంటల్స్ స్టాల్స్ అంటూ జయత్రి ఇన్‌ఫ్రా వల విసిరేసింది. అది నమ్మి రిటైర్‌మెంట్ డబ్బులు, ఏళ్ల తరబడి కూడబెట్టిన సొమ్మును.. కాకర్ల శ్రీనివాస్ అండ్ టీమ్ చేతిలో పోశారు జనం. ఫ్లాట్ రేటులో 30 నుంచి 70 శాతం ముందే కట్టించుకున్నారు. సీన్ కట్ చేస్తే.. రియల్ చీటర్ అసలు రంగులు బయటపడ్డాయి. డబ్బు కట్టిన తర్వాత కాకర్ల అండ్ టీమ్ కనిపించకుండా పోవడంతో, మోసపోయామని బాధితులు గ్రహించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల రూపాయలను కాకార్ల శ్రీనివాస్ వసూలు చేశాడని బాధితులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కళ్లకు రూ. 20 నుంచి కోటి 80 లక్షల దాకా టోపీ పెట్టాడు..
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న KPHB పోలీసులు కాకర్లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విడుదలైన కాకర్ల మళ్లీ గాయబ్ అయ్యాడు. కాళ్లరిగిపోయేలా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. హైకోర్టు ఆదేశించినా కూకట్‌పల్లి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు బాధితులు.
2020లో అనాథాశ్రమం పేరుతో మోసం
ఈ వంచన వెంచర్స్ కథా చిత్రమ్‌లో జయత్రి ఇన్‌ఫ్రా ఎండీ కాకర్ల శ్రీనివాస్ మెయిన్ యాక్టర్ అని, హరిప్రసాద్ , బొల్లా శ్రీనివాసరావు, మునీశ్వర్, దొరబాబు లాంటి డైరెక్టర్లు ఛోటా యాక్లర్లంటున్నారు బాధితులు. ఇదే కాకర్ల శ్రీనివాస్ అండ్ టీమ్ గతంలో కూడా మోసాలు చేసిందంటున్నారు బాధితులు. 2020లో మియాపూర్‌లో అనాథ శరణాలయం పేరుతో కోటి రూపాయలు నొక్కేసి, అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్నాడంటున్నారు అతగాడి బాధితులు. 2023 నుంచి జయత్రి ఇన్‌ఫ్రా వలలో చిక్కుకుని కోట్ల రూపాయలు పోగొట్టుకుని తాము కూడా అతగాడి కోసం గాలిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వాళ్లు కోరుతున్నారు. ఇంటి కల చెదిరిపోయి, దాచుకున్న డబ్బు కోల్పోయిన బాధితులు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..