హిందువులు హనుమంతుడిని బలం, భక్తి , విధేయతకు చిహ్నంగా భావిస్తారు… దైవంగా భావించి పూజిస్తారు. హనుమంతుడి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి, ఆశీర్వాదాలు పొందడానికి వివిధ మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు. వీటిలో ఒక ముఖ్యమైన ఆచారం హనుమంతుని కోసం 40 రోజులు ఉపవాసం ఉండటం. ఈ ఉపవాసం భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. 40 రోజుల పాటు చేసే హనుమాన్ వ్రతం, భక్తులు హనుమంతుడి పట్ల తమ భక్తిని, అంకితభావాన్ని తెలియజేసే ఒక ప్రతిజ్ఞ కాలం. ఈ సమయంలో భక్తులు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. అవి ఏమిటంటే..
హనుమంతుని 40 రోజుల పాటు ఉపవాసం ఉండటానికి నియమాలు?
ఈ 40 రోజుల పాటు ప్రతిరోజూ హనుమంతుడిని పూజించాలి. పువ్వులు, సింధూరాన్ని సమర్పించాలి. హనుమంతుడికి ఇష్టమైన శనగలు, అరటిపండ్లు వాటిని నైవేధ్యంగా సమర్పించాలి
హనుమాన్ చాలీసా పారాయణం
ఈ 40 రోజులు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా ముఖ్యం. కొంతమంది భక్తులు ప్రతిరోజూ అనేకసార్లు దీనిని పారాయణం చేస్తారు.
ఉపవాసం పాటించే వ్యక్తి సాత్విక ఆహారం తినాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
హనుమంతుడు బ్రహ్మచారి కనుక ఈ కాలంలో కొంతమంది భక్తులు బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది.
ఈ సమయంలో మీ శక్తి సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం కూడా ఈ ఉపవాసంలో ఒక ముఖ్యమైన భాగం.
40 రోజుల ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు
మత విశ్వాసాల ప్రకారం భక్తులు 40 రోజుల పాటు హనుమంతుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల శారీరక, మానసిక బలం పెరుగుతుందని నమ్ముతారు. హనుమంతుడు బలానికి ప్రతీక.. ఆయనను పూజించడం వల్ల ఆయన భక్తులకు కూడా బలం చేకూరుతుంది.40 రోజులు వ్రతం చేయడం వలన జీవితంలోని ఇబ్బందులు, అడ్డంకుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
ఈ ఉపవాసం భయం, ప్రతికూల ఆలోచనలను తొలగించడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భక్తులు తమ ప్రత్యేక కోరికలు తీర్చుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు. నిర్మలమైన భక్తితో ఉపవాసం పాటించడం ద్వారా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు