హైదరాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని, స్టడీ సర్కిళ్లను ఉద్యోగ కల్పన కేంద్రాలుగా మార్చాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై తాజాగా సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గురుకుల విద్యాలయాల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో వారందరికీ ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని అధికారులకు తెలిపారు.
బీసీ స్టడీ సర్కిళ్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపైనా దృష్టి సారించాలని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల భవనాలకు అవసరైన మరమ్మతులు, కిటికీలు, ప్రధాన ద్వారాలకు దోమతెరల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని, అలాగే అద్దె భవనాల బకాయిలు కూడా వెంటనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ ఆస్తులు, నిర్వహణ, ఆదాయ వనరులపై, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, వాటికి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి తదితర అంశాలపై చర్చించారు.
జేఈఈ మెయిన్ బీఆర్క్/బి ప్లానింగ్ 2025 ప్రాథమిక కీ విడుదల.. త్వరలో ఫలితాలు
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీ ఆర్క్, బీ ప్లానింగ్ ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పేపర్ 2ఏ, 2బి ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెలువడింది. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 నుంచి 16వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుపవచ్చని అన్నారు. కాగా జేఈఈ మెయిన్ బీఆర్క్/బి ప్లానింగ్ 2025 జనవరి 30వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ (మెయిన్) తుది ఫలితాలు విడుదలైనాయి. త్వరలోనే జేఈఈ మెయిన్ బీఆర్క్/బి ప్లానింగ్ ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.