గుంటూరు జిల్లాలోనే అమరావతి రాజధాని ఉంది. రాజధాని ప్రాంతంతో పాటు గుంటూరు కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. కార్పోరేషన్ పరిధిలోని ఒక షాపును వేలం పాటలో నెలకి ఐదు లక్షల యాభై వేల రూపాయలకు పాడుకున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం అవుతోంది.
కార్పోరేషన్ పరిధిలోని ఆర్టిసి బస్టాండ్‌కు ఎదురుగా కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ఉంది. అక్కడ మొత్తం 88 షాపులుున్నాయి. ఇవన్నీ కార్పోరేషన్ పరిధిలోకే వస్తాయి. గతంలో వీటి ద్వారా నెలకి 6.80 లక్షల ఆదాయం వచ్చేది. అయితే లీజు గడవు ముగియడంతోనే కార్పోరేషన్ అధికారులు షాపులకు వేలం నిర్వహించారు. 81 షాపుల వేలం పూర్తయ్యే సరికి నెలకి యాభై లక్షల రూపాయల ఆదాయం సమకూరనుంది. గతంలో కంటే అన్ని షాపులకు అత్యధిక అద్దె చెల్లించేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ముప్పై వేల నుండి 5.5 లక్షలు చెల్లించనున్నారు. మార్కెట్ మొదట్లో ఉండే 67వ షాపుకు అత్యధికంగా 5.5 లక్షలు నెలనెల అద్దె చెల్లించేందుకు వ్యాపారి ముందుకొచ్చారు. బహిరంగ వేలం పాటలో అత్యధిక రెంటుకు ఈ షాపును దక్కించుకున్నారు. 81 షాపుల ద్వారా కార్పోరేషన్‌కి ఏటా 6 కోట్ల రూపాయల ఆదాయం రానుంది.
67నంబర్ షాపుకు అత్యధిక రెంటు చెల్లించేందుకు ముందుకు రావడానికి ప్రధానం కారణం ఈ షాపులో క్యాంటిన్ నిర్వహిస్తారు. రెండంతస్తుల్లో ఈ షాపు ఉంటుంది. హోల్ సేల్ మార్కెట్ కావడంతో ఈ క్యాంటిన్ 24 గంటల పాటు నడుస్తోంది. దీంతో ఈ షాపును దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. 336 చదరపు అడుగులున్న ఈ షాపు ఏకంగా ఐదున్నర లక్షల రూపాయలు పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాతికేళ్ల పాటు లీజు ఉంటుందని ప్రతి మూడేళ్లకు 33 శాతం రెంటులో పెంపుదల ఉంటుందని కమీషనర్ పులి శ్రీనివాస్ తెలిపారు. రాజధాని జిల్లా కావడంతోనే అత్యధిక అద్దె వచ్చినట్లు కార్పోరేషన్ అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..