నిజమైన, నకిలీ బంగారం మధ్య తేడా గుర్తించడానికి ప్రభుత్వం బంగారు ప్రామాణీకరణను ప్రారంభించింది. దీన్నే మామూలు భాషలో హాల్‌మార్కింగ్ అని కూడా పిలుస్తారు. హాల్‌మార్కింగ్ అనేది ఆభరణాలపై ఉండే స్వచ్ఛతకు హామీని ఇచ్చే ముద్ర. ఈ ఆభరణాలు, నాణేలు, బంగారు కడ్డీల స్వచ్ఛతకు హామీ ఇవ్వడానికి అనేక ప్రమాణాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణాలలో 916 బంగారం, 18 క్యారెట్ బంగారం, బీఐఎస్ హాల్‌మార్కింగ్ లాంటివి ఉన్నాయి. అసలు బంగారం స్వచ్ఛతను ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి…
916 బంగారం అంటే ఏమిటి?
మీరు బంగారం కొనేందుకు వెళ్లినప్పుడు ఎప్పుడైనా గమనించారా.. ఆ షాపు వారు మీకు ఇది 916 బంగారు స్వచ్ఛత కలిగిన నగలని చెప్తుంటారు. అసలు ఈ 916 అంటే ఏంటి.. మీరు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు లేదా నాణెంలో ఎంత బంగారం ఉందో ఈ పదం తెలియజేస్తుంది. ఏదైనా ఆభరణాలను 916 గా అమ్మితే అది 91.6% స్వచ్ఛమైన బంగారం అని అర్థం. మిగిలిన వస్తువులు వేరే లోహంతో తయారు చేస్తుంటారు. ఇక్కడ 916 గుర్తు బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ శాతం ఆభరణాలకు అత్యంత స్వచ్ఛమైనదిగా చెప్పొచ్చు.
మరి వంద శాతం బంగారం దొరకదా అని మీకు సందేహం కలగవచ్చు. దొరుకుతుంది కానీ, దాంతో మీరు బంగారు నగలను తయారుచేయలేరు. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. పెట్టుబడి కోసం బంగారం కొనేవారికి ఇది మంచి ఆప్షన్. కాబట్టి దాంతో ఏదైనా ఆభరణం చేయాలంటే అందులో మరైదైనా లోహాన్ని కలిపి తీరాల్సిందే. అప్పుడే అది నగల తయారీకి అనువుగా మారుతుంది. రాగి, నికెల్, జింక్, పల్లాడియం, వెండి మొదలైన ఇతర లోహాలను బంగారంతో పాటు ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు.
916.. 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏంటి?
నిజానికి 22 క్యారెట్ల బంగారం లేదా 916 బంగారం మధ్య ఎలాంటి తేడా లేదు. రెండూ ఒకటే. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారానికి మిశ్రమలోహాన్ని జతచేస్తుంటారు. ఒక ఆభరణం 100 గ్రాముల బరువు ఉందని అనుకుందాం, అప్పుడు అందులో 91.6 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఉంటుంది. మిగిలిన భాగం వేరే లోహంతో ఉంటుంది. దీనిని 22/24 అంటారు. 24 క్యారెట్ల బంగారం నుండి 8.4 శాతం తీసివేస్తే, అది 22 క్యారెట్ల బంగారం అవుతుంది. ఇక్కడ 8.4 శాతం చొప్పున ఇతర లోహాలను కలిపి ఆభరణాలను తయారు చేస్తారు.
స్వచ్ఛతను ఎలా నిర్ణయిస్తారు?
అది 24 క్యారెట్ల బంగారం అయితే 100 గ్రాములలో 99.9 శాతం బంగారం ఉందని అర్థం. 23 క్యారెట్లు ఉంటే 100 గ్రాములలో 95.8 గ్రాముల బంగారం ఉంటుంది. అదే 22 క్యారెట్లు ఉంటే 91.6 శాతం బంగారం ఉంటుంది. అదేవిధంగా, 18 క్యారెట్ల బంగారంలో 75 గ్రాముల బంగారం ఉంటుంది. 15 క్యారెట్ల బంగారంలో 58.5 శాతం బంగారం ఉంటుంది, ఇది 100 గ్రాములకు ఉంటుంది. ఆభరణాల ధర దానిలోని బంగారం మొత్తాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.