బంగారం పెట్టుబడిదారులకు ఈ ఏడాది తొలి భాగం మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక రెండో భాగం ఎలా ఉంటుందనే దానిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 2025 మొదటి ఆరు నెలల్లో.. ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సుంకాలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించాయి. అయితే వీటన్నింటి మధ్య బంగారం..పెట్టుబడిదారులకు మంచి ఛాయిస్‌గా మారింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, గోల్డ్ మిడ్ ఇయర్ అవుట్‌లుక్ 2025 నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం యూఎస్ డాలర్‌తో పోలిస్తే 26 శాతం అద్భుతమైన లాభాన్ని నమోదు చేసింది. బంగారం 26 సార్లు ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. ఇది రికార్డు అని చెప్పాలి. డాలర్ బలహీనత, స్థిరమైన వడ్డీ రేట్లు, పెరుగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితి.. పెట్టుబడిదారులకు బంగారాన్ని సురక్షితమైన ఎంపికగా మార్చాయని నివేదిక వెల్లడించింది. మొదటి ఆరు నెలల్లో బంగారం సగటు ధర ఔన్సుకు 3,067 డాలర్లు ఉంటే, జూన్ చివరి నాటికి అది 3,287 డాలర్లకు చేరుకుంది.
బంగారం డిమాండ్ ఎందుకు పెరిగింది..?
1973 తర్వాత 2025 మొదటి అర్ధభాగంలో యూఎస్ డాలర్ అత్యంత బలహీనంగా మారింది. ఈ కాలంలో యూఎస్ ట్రెజరీ బాండ్ల పనితీరు కూడా బలహీనంగానే ఉంది. దీంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌ను కాదని బంగారం వైపు మొగ్గు చూపారు. దీని కారణంగా బంగారం మార్కెట్‌లో డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారంలో పెట్టుబడుల ప్రవాహంతో నిర్వహణలో ఉన్న ప్రపంచ ఆస్తులు 41 శాతం పెరిగి 383 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం కొనసాగించాయి. ఇది డిమాండ్‌ను మరింత బలపరిచింది.
బంగారం తగ్గుతుందా.. పెరుగుతుందా?
ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో బంగారం పనితీరుకు సంబంధించి మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి దాని ధరను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది.. ఫెడ్ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లయితే, యూఎస్ జీడీపీ వృద్ధి బలహీనంగా ఉండి, ద్రవ్యోల్బణం 2.9 శాతానికి చేరుకుంటే, బంగారం ధరలు 0 నుండి 5 శాతం వరకు పెరగవచ్చు. రెండోది.. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం లేదా స్తబ్దత వంటి పరిస్థితి ఏర్పడితే, బంగారం సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో దాని ధరలు మరో 10 నుండి 15 శాతం వరకు పెరగవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి ఇది మొత్తం మీద 40 శాతం పెరగవచ్చు. ఇక మూడోది.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్లు కనిపిస్తే, పెట్టుబడిదారుల మొగ్గు రిస్క్ ఆస్తుల వైపు పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, బంగారం ధరలు 12 నుండి 17 శాతం వరకు తగ్గవచ్చు.
బంగారం రేట్లు ఇలా ఉండే ఛాన్స్..
ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 99,920 గా ఉంది. పైనా మూడు పాయింట్లను ఈ ధరతో చూస్తే.. మొదటి లెక్క ప్రకారం బంగారం ధర 5 శాతం పెరిగితే.. అది ఢిల్లీలో రూ.1,04,916కి చేరుకుంటుంది. రెండో దాని ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి ధర 40 శాతం పెరిగితే, బంగారం ధర రూ.1,39,888కి చేరవవచ్చు. మూడో లెక్క ప్రకారం.. ధర 12 శాతం తగ్గితే, కొత్త ధర రూ.87,929కి తగ్గవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..