ఇళ్లలోనూ ఫ్రిజ్ సాధారణంగా మారిపోయింది. కూరగాయల నుంచి ఎన్నో తిండి పదార్థాల వరకు అన్నింటినీ ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారు. అయితే, ఫ్రీజర్ సంగతి ఏమిటి? మధ్యమధ్యలో దానిని శుభ్రం చేస్తున్నారా? చాలాసార్లు ఫ్రీజర్‌లో ఐస్ గడ్డకట్టి, కొన్నిసార్లు అది తొలగించలేనంత గట్టిగా మారిపోతుంది. అలాంటప్పుడు, “సింపుల్‌గా డీఫ్రాస్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది కదా” అనుకుంటారు. కానీ దీని వల్ల కూడా ఒక్కోసారి మంచు కరగదు. ఆ సమయంలో ఐస్‌ను తొలగించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే మాత్రం ఈ పని చాలా సులువుగా పూర్తైపోతుంది. ఎక్కువ శ్రమ పడకుండానే గడ్డకట్టిన ఐస్ కరిగిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.
వచ్చే సమస్యలు
ఐస్ ఇలా గడ్డకట్టి అలాగే ఉంటే ఫ్రిజ్ పాడైపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, సరైన విధంగా కూలింగ్ అవ్వక, పవర్ బిల్లు వృథా అవుతుంది. లోపల ఉన్న ఆహార పదార్థాలు కూడా పాడైపోతాయి. సింపుల్‌గా డీఫ్రాస్ట్ ఆప్షన్ వాడవచ్చు అనుకుంటారు. కానీ ప్రతిసారీ ఇది పని చేయకపోవచ్చు. అందుకే కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
అవేంటంటే..
1. పవర్ ఆఫ్ చేసి, టవల్స్ వాడండి:
ముందుగా ఫ్రిజ్‌కి పవర్ సప్లై ఆపాలి. అంటే స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం ఎప్పుడూ సురక్షితం. ఆ తర్వాత ఫ్రిజ్‌లో ఉన్న అన్ని వస్తువులను బయటకు తీసి, చల్లగా ఉండే చోట పెట్టాలి. ఇప్పుడు ఫ్రిజ్ చుట్టూ పెద్ద టవల్స్ వేసి ఉంచాలి. పవర్ సప్లై ఆగిపోవడం వల్ల మంచు గడ్డకట్టడం ఆగిపోతుంది. పైగా ఉన్న మంచు అంతా క్రమంగా కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన నీరంతా కింద వేసిన టవల్స్‌పై పడుతుంది. ఆ తర్వాత ఆ టవల్స్‌ను ఉతికితే సరిపోతుంది.
2. వేడి నీటితో ఐస్ తొలగించండి
ఇక ఇప్పుడు చెప్పే మరో చిట్కాతో ఫ్రీజర్‌లోని ఐస్ అంతా చాలా వేగంగా కరిగిపోతుంది. అందుకోసం ఏం చేయాలంటే:
ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. వాటిని వేడిని ఎక్కువ సమయం పాటు పట్టి ఉంచే గిన్నెలో పోయాలి (ఉదాహరణకు, మెటల్ లేదా సెరామిక్ బౌల్). ఆ తర్వాత ఫ్రీజర్‌లో మందంగా ఉన్న క్లాత్ (లేదా ఒక చిన్న చెక్క పలక) వేయాలి. ఆ క్లాత్‌పై ఈ వేడినీటి బౌల్‌ను పెట్టాలి. తర్వాత ఫ్రీజర్ డోర్ మూసేయాలి. ఇలా కనీసం పావుగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత డోర్ తీసి చెక్ చేయాలి. అప్పటికే మంచు అంతా క్రమంగా కరిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు లేదా చెక్కతో తయారు చేసిన గరిటెలు, చెంచాలతో ఆ మంచుని తొలగించాలి. మీరు కదిలించే కొద్దీ మంచు చాలా సులువుగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే, మంచుని తొలగించేటప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, దీని వల్ల కాయిల్స్ పాడయ్యే అవకాశముంది.
3. హెయిర్ డ్రయర్‌తో జాగ్రత్తగా తొలగించండి
హెయిర్ డ్రయర్‌తో కూడా ఈ మంచు మొత్తం తొలగించవచ్చు. కాకపోతే, జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.
ముందుగా హెయిర్ డ్రయర్‌ను మీడియం లేదా లో హీట్ సెట్టింగ్ వద్ద ఉంచాలి. ఫ్రీజర్ నుండి కాస్తంత దూరంగా ఉంచి డ్రై చేయాలి. ఎక్కడైతే మరీ ఎక్కువగా ఐస్ గడ్డకట్టి ఉంటుందో, అక్కడ ఎక్కువ సేపు ఉంచాలి. ఇలా చేస్తుండగానే కాసేపటికే మంచు అంతా కరిగిపోతుంది. అయితే, పొరపాటున కూడా హెయిర్ డ్రయర్‌పై నీరు పడకుండా చూసుకోవాలి. అందుకే కాస్తంత దూరంగానే ఉంచాలి. ఈ ప్రాసెస్ అంతా చేసే సమయంలో ఫ్రిజ్‌కి పవర్ సప్లై ఆపేస్తేనే మంచిది. ఫ్రిజ్ క్లీన్ చేసినప్పుడు లేదా ఫ్రిజ్‌లో ఇంకేదైనా రిపేర్ చేసినప్పుడు తప్పనిసరిగా పవర్ ఆపేయడం శ్రేయస్కరం. అలా ఆన్ చేసి ఎక్కువ సమయం పాటు ఉంచితే కరెంట్ షాక్ వచ్చే ముప్పు ఉంటుంది. అంతే కాదు, కాయిల్స్ పాడైపోయే అవకాశమూ ఉంటుంది.
4. వేడి టవల్‌తో సులువైన పద్ధతి
ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వేడి నీళ్లలో మందంగా ఉన్న టవల్ ముంచాలి. ఆ తర్వాత ఫ్రిజ్ స్విచ్ ఆఫ్ చేసి, ఆ వేడి టవల్‌ను ఫ్రీజర్‌లో ఉంచాలి. తర్వాత ఫ్రీజర్ డోర్ మూసేసి కనీసం పది నిమిషాల పాటు వదిలేయాలి. ఈ వేడి వల్ల క్రమంగా మంచు సాఫ్ట్‌గా మారిపోతుంది, సులువుగా తొలగించేందుకు వీలవుతుంది. హెయిర్ డ్రయర్ చిట్కా పాటించడం కాస్త రిస్క్ అనుకున్నప్పుడు ఈ టవల్ చిట్కా ఫాలో అయిపోవచ్చు. దీని వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు.
మరో ప్రత్యామ్నాయం:
ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి, ఐస్‌కి సరైన విధంగా గాలి తగిలేలా ఎదురుగా ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టాలి. దీని వల్ల వేడి గాలి తగిలి గడ్డకట్టిన మంచు అంతా మెల్లగా కరిగిపోతుంది.
ఐస్ కరిగాక ఏం చేయాలంటే?
ఫ్రీజర్‌లో ఉన్న ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత, లోపల అంతా ఒక సాఫ్ట్ క్లాత్‌తో శుభ్రం చేయాలి. అయితే, మామూలు నీటితో కాకుండా వేడి నీటితో క్లీన్ చేయడం మంచిది. ఈ నీళ్లలోనే కాస్తంత వెనిగర్ లేదా సబ్బు నీరు కలిపితే ఇంకా బాగా శుభ్రం అవుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత పూర్తిగా ఆరేంత వరకూ అలాగే ఫ్రిజ్ డోర్ తెరచి ఉంచాలి. తేమ అంతా తగ్గిపోయిన తర్వాతే మళ్లీ ఫ్రిజ్ ఆన్ చేయాలి. ఫ్రీజర్ డోర్‌ను ఎప్పటికప్పుడు సరిగ్గా క్లోజ్ చేస్తూ ఉండాలి. డోర్‌కి ఏమైనా లీకేజ్‌లు ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. మరీ ఎక్కువగా ఐటమ్స్ పెట్టినా ఫ్రిజ్ పాడైపోతుందని గుర్తుంచుకోవాలి