కోతికి మనిషికి పోలిక ఉండటాన్ని మనం గమనించాం. అయితే చేపల్లో రూప్ చంద్ రకానికి చెందిన చేపకు అచ్చంగా మనిషి నోట్లో కింది దవడ దానికి ఉండే పళ్ల వరుస ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఈ చేపకు ఉంటుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల చెరువులు ఎక్కువగా ఉన్నాయి. చేపలకు పోషకాహారం అందించేందుకు ఎక్కువగా చికెన్ వేస్ట్‌ను వాటికి ఆహారంగా వేస్తారు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల నీటితో పాటు, నేల సైతం కాలుష్యానికి గురవుతుంది.
ఇక పండుగప్ప చేపలకు ఆహారంగా చిన్ని చిన్ని చేపలను వేస్తారు. చేపలు దీనివల్ల బలంగా పెరిగి బరువు తూగుతాయి. ఇక రూప్ చంద్ చేపల విషయానికి వస్తే.. ఇవి ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడతాయి. ఇవి పిరానా జాతికి చెందినవి. ఈ రకం చేపలు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా బెంగాల్‌కు ఎగుమతి అవుతున్నాయి. బెంగాలీలు వీటిని ఇష్టంగా తింటారు. ప్రోటీన్ ఎక్కువగానూ.. కొవ్వు తక్కువగానూ ఉండటంతో.. వీటిని బరువు తగ్గాలనుకునేవారు ఆహారంగా తీసుకుంటారు.
అంతేకాదు ఈ రూప్‌చంద్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుందని చెబుతున్నారు. చెరువుల్లో వీటిని కేజీ నుంచి 3 కేజీల బరువు వరకు పెంచిన తర్వాత పట్టుకుని ఎగుమతి చేస్తారు. వీటిని పట్టుకునే సమయంలో చెరువుల్లో దిగే కూలీలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దీనికి బలమైన దంతాలు ఉండటంతో ఒక్కోసారి కాలి, చేతి వేళ్లు కొరుకుతాయని స్థానిక మత్స్యకారులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి